Categories: TOP STORIES

సామాన్యూడికి భారం పడదు

శాస్త్రీయ పద్దతిలో భూముల ధరల సవరణ
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రక్షాళన
రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

సామాన్య ప్రజానీకంపై ఎలాంటి భారం పడకుండా ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరలను శాస్త్రీయంగా సవరించాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖపై శుక్రవారం సచివాలయంలో ఆయ‌న‌ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో ఉన్న భూముల ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో దానికి అనుగుణంగా భూముల ధరలను సవరించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లండించారు.

బహిరంగ మార్కెట్ విలువలకు, మార్కెట్ ధరలకు భారీగా వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా శాస్త్రీయ పద్ధతిలో భూముల ధరల సవరణ జరగాలని సూచించారు. ఏయే ప్రాంతాల్లో ఎక్కువ వ్యత్యాసం ఉంది, అక్కడ హేతుబద్ధంగా ఎంత శాతం పెంచేందుకు అవకాశం ఉంది తదితర అంశాలపై లోతైన అధ్యయనం చేయాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువ కంటే, ప్రభుత్వ ధర అధికంగా ఉందని అక్కడ తగ్గించాలన్నారు.

గత ప్రభుత్వంలో ఎలాంటి కసరత్తు చేయకుండానే భూముల ధరలను పెంచారని ఇప్పుడు అటువంటి పరిస్థితి పునరావృతం కాకూడదన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని ఇందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. చట్టంలో ఉన్న లొసుగులకు ముగింపు పలికేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారు గంటల తరబడి చెట్ల కింద వేచి చూసే పరిస్థితి లేకుండా రాష్ట్రవ్యాప్తంగా అత్యాధునిక వసతులతో శాశ్వతంగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తామని తెలిపారు. ఇందుకోసం అవసరమైన భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్లకు టైమ్ స్లాట్ అంశాన్ని పరిశీలించాలని సూచించారు. పని భారం అధికంగా ఉన్న సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రత్యామ్నాయం చూడాలని అన్నారు. పనితీరు ఆధారంగా పారదర్శకంగా ఉద్యోగుల బదిలీలను చేపడుతామని హామీ ఇచ్చారు.

This website uses cookies.