Categories: TOP STORIES

ఫార్చ్యూన్ 99 హోమ్స్ పాయే.. లావోరా డెవలపర్స్ వచ్చే..

  • బ‌య్య‌ర్లూ.. జ‌ర‌భ‌ద్రం!
  • రియ‌ల్ సంస్థ‌ల స‌రికొత్త మోసం
  • రెరా అనుమ‌తి తీసుకోకుండా
  • సినీ తార‌ల‌తో వెంచ‌ర్ల‌లో ప్ర‌చారం
  • వెంచ‌ర్ పేరు మార్చి అమ్మ‌కాలు
  • సాహితీ, జ‌య ప్రీలాంచ్ త‌ర‌హాలో
  • మీరు ఎట్టి ప‌రిస్థితిలో మోస‌పోకండి!
  • వీరి మాయ‌లో ప‌డితే అంతే సంగ‌తులు

సినిమాలో చిన్న చిన్న వేషాలేసే తార‌ల్ని చూపెట్టి.. వీలైతే వారాంతాల్లో వారిని బ‌య్య‌ర్ల‌తో మాట్లాడిచ్చి.. ప్లాట్ల‌ను అమ్మేయాల‌ని బ‌డా స్కెచ్ వేస్తున్నారు కొంత‌మంది రియ‌ల్ట‌ర్లు. మీరు లావోరా డెవ‌ల‌ప‌ర్స్ సైట్ల‌కు వెళ్లిన‌ప్పుడు కావాలంటే వారితో ఫోటోలు దిగండి.. సెల్ఫీలు తీసుకోండి.. అంతేకానీ, రెరా అనుమ‌తి ఉంటేనే ప్లాట్ల‌ను కొనుగోలు చేయండి. ఎందుకంటే, పొరుగు రాష్ట్రాల‌కు చెందిన కొంద‌రు మోస‌పూరిత వ్య‌క్తులు.. న‌గ‌రానికి విచ్చేసి ప్రీలాంచుల పేరిట అమాయ‌కుల‌కు గాలం వేస్తున్నారు. రేటు త‌క్కువంటూ సొమ్ము వ‌సూలు చేస్తున్నారు.

హైదరాబాద్ రియల్ రంగానికి గల సానుకూలతల్ని అర్థం చేసుకుని.. అనేక మంది బిల్డర్లు గత ముప్పయ్యేళ్ల నుంచి మెరుగైన నిర్మాణాల్ని నిర్మిస్తున్నారు. మూడు దశాబ్దాల్లో కొనుగోలుదారుల్ని మోసం చేసిన సంస్థల్ని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. కాకపోతే, ఇటీవల నగర రియల్ రంగంలో ఆందోళన కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సులువుగా సొమ్ము సంపాదించాలనే ఏకైక లక్ష్యంతో.. పొరుగు రాష్ట్రాల నుంచి విచ్చేసి.. కొందరు అక్రమార్కులు భాగ్యనగరంలో ప్రీలాంచుల పేరిట అమాయకులను మోసం చేసే పనిని పెట్టుకున్నారు.

LAVOURA HILLSIDE NO RERA APPROVAL

ఒక సంస్థ పేరిట ప్రజలకు కుచ్చుటోపి పెట్టి మళ్లీ పేరు మార్చి బయ్యర్లను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి మోసపూరిత రియల్టర్ల పట్ల కొనుగోలుదారులు జాగ్రత్తగా వ్యవహరించాలి. వారు చెప్పే మోసపూరిత మాటల్ని నమ్మకుండా.. రెరా అనుమతి పొందిన తర్వాతే ప్లాట్లను కొనుగోలు చేయాలి. లేకపోతే సాహితీ, జయా గ్రూప్ బాధితుల తరహాలో మీరూ పోలీసు స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగినా ఉపయోగముండదు.

ఫార్చ్యూన్ 99 హోమ్స్ పేరిట అమాయ‌క కొనుగోలుదారుల‌కు కుచ్చుటోపి పెట్టింది. బాధితులు కేబీఆర్ పార్కు వ‌ద్ద నిర‌స‌న‌లు చేప‌ట్టారు. బంజారాహిల్స్ పోలీసు స్టేష‌న్‌ను ఆశ్ర‌యించారు. ఆత‌ర్వాత ఈ సంస్థ కొనుగోలుదారుల‌కు క‌ట్టిన సొమ్మును వెన‌క్కి ఇవ్వ‌డం ఆరంభించింది. అంటే, బ‌య్య‌ర్లు క‌ట్టిన సొమ్ము మాత్ర‌మే వాప‌సు ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తోంది త‌ప్ప‌.. అప్ప‌ట్నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ వారి పెట్టుబ‌డి మీద వ‌డ్డీ చెల్లించాలి. లేదా సొమ్ము క‌ట్టిన‌ప్ప‌ట్నుంచి ప్ర‌స్తుతం పెరిగిన రేటు చొప్పున లెక్కించి క‌ట్టాలి. కానీ, ఇవేవీ చేయ‌కుండా కేవ‌లం బ‌య్య‌ర్లు క‌ట్టిన సొమ్మునే వెన‌క్కి ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. ఇదంతా ఒక‌వైపు అయితే, ఫార్చ్యూన్ 99 హోమ్స్ సంస్థ పేరు మార్చుకుని.. లావోరా డెవ‌ల‌పర్స్‌గా అవ‌త‌రించింది. డైరెక్ట‌ర్ల పేర్లు మారిపోయాయి. ఢామిట్‌.. మ‌ళ్లీ కొత్త ప్రీలాంచ్ క‌థ ఆరంభ‌మైంది. ఈసారి చిన్న‌పాటి న‌టీమ‌ణుల‌తో ప్ర‌చారాన్ని ప్రారంభించింది. ఇలా ప్రీలాంచులో ప్లాట్ల‌ను విక్ర‌యించ‌డం బ‌దులు.. రెరా అనుమ‌తి తీసుకుని ఎంచక్కా ద‌ర్జాగా ప్లాట్ల‌ను అమ్మొచ్చు క‌దా!

This website uses cookies.