Categories: LATEST UPDATES

కొవిడ్ నియంత్రణలో గేటెడ్ కమ్యూనిటీలు..

పెరుగుతున్న కొవిడ్ కేసుల్ని నియంత్రించడానికి నగరంలో గేటెడ్ కమ్యూనిటీలు కట్టుదిట్టమైన చర్యల్ని తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో వీరికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. ఇందుకోసం వారితో ప్రత్యేకంగా జూమ్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు వారి సమస్యల్ని తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. ఇందుకోసం సైబరాబాద్ పరిధిలోని గేటెడ్ కమ్యూనిటీలతో ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపులను ఆరంభించడం విశేషం.

V. C. Sajjanar

సైబరాబాద్ పరిధిలోని గేటెడ్ కమ్యూనిటీల్లో గత కొంతకాలం నుంచి కొవిడ్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా, మై హెమ్ జ్యుయల్ వంటి బడా టౌన్ షిప్పులో వందకు పైగా కేసులు నమోదయ్యాయి. కాస్త బడా గేటెడ్ కమ్యూనిటీల్ని నిశితంగా పరిశీలిస్తే.. యాభై కంటే తక్కువ కేసులు ఎక్కడా లేవు. పలు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు కొవిడ్ నివారించేందుకు కట్టుదిట్టమైన చర్యల్ని తీసుకోవడం వల్ల కొంతశాతం నివాసితుల నుంచి ప్రతిఘటన ఎదురవుతున్నది. ఇటీవల సైబరాబాద్ పరిధిలోని ఒక కమ్యూనిటిలో నివసించే వారైతే ఏకంగా నివాస సంక్షేమ సంఘం మీద పోలీసు కేసు కూడా పెట్టారు. అయితే, కమ్యూనిటీలో కొవిడ్ కేసుల్ని తగ్గించేందుకు కఠిన నిర్ణయాల్ని అమలు చేయాల్సిందేనని కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. కనిపించని శత్రువు దాడి చేస్తున్న ఇలాంటి తరుణంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిందేనని.. సంక్షేమ సంఘానికి తోడ్పాటును అందించాల్సిందేనని సూచించారు.

ముందే అప్రమత్తం..

సైబరాబాద్ పరిధిలోని కొన్ని గేటెడ్ కమ్యూనిటీల్లో మాత్రం నివాసితులు సంక్షేమ సంఘానికి పూర్తిగా సహకరిస్తున్నారు. ఉదాహరణకు, మియాపూర్ లో 500కు పైగా ఫ్లాట్లు గల ఎస్ఎంఆర్ వినయ్ సిటీని తీసుకుంటే, కొవిడ్ కేసులు పెరుగుతాయని ముందే పసిగట్టిన ఈ సంక్షేమ సంఘం ఆవరణలో ఉన్న జిమ్, క్రికెట్ గ్రౌండ్, బాస్కెట్ బాల్, టెన్నిస్ కోర్టులు, ఇండోర్ స్టేడియం వంటివన్నీ ఏప్రిల్ 9న మూసివేశారు. దీంతో, అక్కడ కేసులు తక్కువగా నమోదయ్యాయి. అంతకంటే ముందు వారం నుంచే డెలివరీ బాయ్స్ ని లోపలికి అనుమతించడం నిలిపివేశారు. ఇతర రాష్ట్రాల నుంచి అపార్టుమెంట్లోకి వచ్చే నివాసితులు వారం రోజుల పాటు తప్పకుండా హోం క్వారంటైన్ లో ఉండాలనే నిబంధనను విధించారు. కమ్యూనిటీలో ఉన్న హెర్బల్, మెడిసినల్ మొక్కలతో పని చేసే సిబ్బందికి వారంలో రెండు రోజుల పాటు మాచిపత్రి, తిప్పతీగ వంటివాటితో ప్రత్యేకంగా తయారు చేసిన కషాయం అందజేస్తున్నారు. సైబరాబాద్లోని దాదాపు అన్ని గేటెడ్ కమ్యూనిటీలు కరోనాను నివారించేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. కాకపోతే, అందరూ సహకరిస్తేనే కరోనాను జయించడానికి వీలవుతుంది.

This website uses cookies.