దాదాపు ఆరు ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు కొన్న 200 నుంచి 300 మంది బయ్యర్లు.. గ్రూపులుగా పంజాగుట్టలోని భువనతేజ ఇన్‌ఫ్రా ఆఫీసుకు రావడం.. తమ సొమ్ము వెనక్కివ్వాలని రచ్చరచ్చ చేయడం.. ఇదే తంతు గత కొంతకాలం నుంచి జరుగుతోంది. వీరిలో కొందరైతే సుమారు ఏడాది నుంచి భువనతేజ ఇన్‌ఫ్రాకు చెందిన చక్కా వెంకట సుబ్రమణ్యం చుట్టూ తిరుగుతున్నారు.
సొమ్ము కోసం వచ్చినవారికి ఏవో మాయమాటలు చెప్పి పంపించడం లేదా గంటల తరబడి కూర్చోపెట్టడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. అయితే, ఇతని మాటలు విని విసిగిపోయిన ఒకట్రెండు బృందాలకు చెందిన బయ్యర్లు.. ఇక తాడోపేడో తేల్చుకుందామని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో సంస్థ కార్యాలయంలో రచ్చరచ్చ జరిగినట్లు సమాచారం.
కొంతకాలం క్రితం పారిజాత డెవలపర్స్‌లో పని చేసేటప్పుడు యాక్టివా మీద తిరిగే చక్కా వెంకట సుబ్రమణ్యం.. ప్రీలాంచుల పేరిట మభ్య పెట్టడంతో ప్రజలు వెనకా ముందు చూడకుండా సొమ్ము చెల్లించారు. దీంతో, ఇతను లగ్జరీ కార్లను కొనడం, లగ్జరీగా స్టార్ హోటళ్లలో తిరగడం వంటివి అలవర్చుకున్నాడు. సొమ్మేమో అమాయక ప్రజలది.. సొకులేమో ఇతనివి అంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. అంతెందుకు, ఇతని వద్ద పని చేసిన ఏజెంట్లు సైతం భువనతేజ సంస్థలో ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయించి పీకల మీదికి తెచ్చుకున్నారు. రియల్ ఎస్టేట్ గురుకి అందిన సమాచారం ప్రకారం.. కేవలం హైదరాబాద్‌లో ఈ భువనతేజ ఇన్‌ఫ్రా సంస్థ సుమారు పది ప్రాజెక్టులను ప్రీలాంచుల్లో విక్రయించింది.
హ్యాపీ హోమ్స్ అపార్టుమెంట్స్- శామీర్‌పేట్
హ్యాపీ హోమ్స్ 2 విల్లాస్- శామీర్‌పేట్
భువనతేజా ఔరా-1, వెలిమల
భువనతేజా ఔరా-2, వెలిమల
భువనతేజా బ్లూమ్ డేల్, మేడ్చల్
గ్రీన్ వ్యాలీ, కాప్రా
గోల్డెన్ నెస్ట్, ఇస్నాపూర్
హ్యాపీ హోమ్స్- కడ్తాల్
ఈవీకే ఆవాసా- కొల్లూరు
వీటితో బాటు తులసీ భాగ్యనగర్ తదితర సంస్థలకు చెందిన ప్రాజెక్టే.. తనదేనని బ్రోచర్లు వేసి.. అదే సైటులో కుర్చీ వేసుకుని మరీ కూర్చుని ప్రీలాంచులో ఫ్లాట్లను విక్రయించాడు. మరి, ఆయా సంస్థ ఎండీ బొడ్డు అశోక్ చక్కా వెంకట సుబ్రమణ్యాన్ని ఎలా నమ్మాడు? తనదే ప్రాజెక్టు అంటూ బాహాటంగా చెబుతున్నా ఆయనెందుకు పట్టించుకోలేదో అతనికే తెలియాలి.
ప్రీలాంచుల్లో కస్టమర్ల నుంచి వసూలు చేసిన కోట్లాది రూపాయల్ని.. ఇతర అవసరాలకు మళ్లించాడని బాధితులు వాపోతున్నారు. 2020లో ఫ్లాట్లు కొనుగోలు చేస్తే ఇప్పటివరకూ వాటిని పూర్తి చేయలేదని.. అందుకే తాము సొమ్ము వెనక్కి ఇవ్వమని అంటున్నామని చెబుతున్నారు. ప్రీలాంచులో మూడేళ్ల క్రితమే సొమ్ము వసూలు చేసినప్పటికీ, నేటికీ తులసీ భాగ్యనగర్ సంస్థకు సొమ్ము కట్టలేదు. మరి, ఆ నిధుల్ని చక్కా వెంకటసుబ్రమణ్యం దారి మళ్లించాడా? ఎక్కడైనా భూములు కొనుక్కున్నాడా? వేరే వ్యాపారాలకు సొమ్ము మళ్లించాడా? లేక దుబాయ్ వంటి నగరంలో పెట్టుబడులు పెట్టాడా? ఇలా, కొనుగోలుదారులు విభిన్న రకాలుగా ఆలోచిస్తున్నారు. అతనేం చేసినప్పటికీ, తమ సొమ్ము మాత్రం వెనక్కి ఇవ్వమని బయ్యర్లు అంటున్నారు