Categories: LATEST UPDATES

సేల్ డీడ్ మార్చినందుకు బిల్డర్ కు జరిమానా..

రెరా చట్టం నిబంధనల ప్రకారం ఫ్లాట్ అమ్మకానికి సంబంధించిన ముసాయిదా ఒప్పందాన్ని మార్చే అధికారం బిల్డర్ కు లేదని రెరా స్పష్టంచేసింది. అంతేకాకుండా కొనుగోలుదారుకు ఇవ్వాల్సిన రిఫండ్ ను సదరు ఫ్లాట్ వేరొకరు బుక్ చేసుకునే వరకు ఇవ్వకుండా ఉండడం సబబు కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాజస్థాన్ రెరా ఉత్తర్వులు జారీ చేసింది. యునీక్ బిల్డర్స్ చేపట్టిన ఓ ప్రాజెక్టులో ఓ వ్యక్తి ఫ్లాట్ బుక్ చేసుకుని అడ్వాన్స్ చెల్లించారు.

అయితే, బ్యాంకు నుంచి ఆయనకు రుణం రాకపోవడంతో 45 రోజుల్లో సదరు బుకింగ్ రద్దు అయింది. ఈ నేపథ్యంలో ఆయన చెల్లించిన అడ్వాన్స్ మొత్తం బిల్డర్ తిరిగి ఇవ్వలేదు. రద్దు అయిన ఫ్లాట్ ను మరొకరు బుక్ చేసుకున్న తర్వాతే రిఫండ్ ఇస్తానని తేల్చి చెప్పాడు. దీనికి సంబంధించిన షరతు కొనుగోలు ఒప్పందంలో ఉందని ప్రస్తావించాడు. దీంతో సదరు కొనుగోలుదారు రెరాను ఆశ్రయించారు. వాదనలు విన్న రెరా ధర్మాసనం.. రెరా నిబంధనల్లో అలాంటి షరతు ఏదీ లేదని, బిల్డర్ తన ఇష్టప్రకారం నిబంధనలు మార్చడం కుదరదని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో సదరు బిల్డర్ కు జరిమానా విధించింది.

This website uses cookies.