Categories: TOP STORIES

గో గో.. గోవా

హాలిడే హోమ్స్ కొనడానికి 35 శాతం మందికి ఆ ప్రాంతమే ప్రాధాన్యత

గోవా అనగానే.. గుర్తుకువచ్చేది బీచ్. సాయంత్రం వేళ గోవా బీచ్ లలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఆనందంగా గడపాలనుకునేవారు అంతకంతకూ పెరుగుతున్నారు. గతంలో ఆరు నెలలకో, ఏడాదికో ఓ ట్రిప్సు గోవాకు వెళ్లొచ్చేవారు. కానీ ఇప్పుడు మూడు నాలుగు రోజులు సెలవులు వస్తే చాలు.. గో గో గోవా అంటున్నారు. ఇక వర్క్ ఫ్రం హోమ్ ఉన్నవారైతే గోవాలోనే ఉంటున్నారు. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం, ఇతరత్రా సౌకర్యాలు బాగుండటంతో అక్కడే ఓ హాలిడే హోమ్ కొనేస్తే పోలా అని అనుకునేవారూ పెరుగుతున్నారు.

ఈ నేపథ్యంలో వెకేషన్ హోమ్స్ కి గోవా ప్రముఖ గమ్యస్థానంగా మారింది. దాదాపు 35 శాతం మంది తమ హాలిడే హోమ్ స్పాట్ గా గోవానే ఎంచుకుంటున్నట్టు ఇండియా సోథెబైస్ ఇంటర్నేషనల్ రియల్టీ సర్వే వెల్లడించింది. బాగా డబ్బున్నవారు అక్కడ తమ రెండో ఇంటిని కొనేసుకుంటున్నారు. మరోవైపు పాక్షిక యాజమాన్య అవకాశాన్ని కల్పించే పరిస్థితులు కూడా పెరిగాయి. ఖరీదైన స్థిరాస్తుల్లో తమ వద్దనున్న పెట్టుబడితో పాక్షిక వాటాలను కొనుగోలు చేసే అవకాశాలను స్థానిక రియల్ సంస్థలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోవాలో రియల్ రంగం బాగా ఊపందుకుంది.

పైగా ఆధునికతకు పెద్ద పీట వేస్తుండటం మరింత సానుకూలాంశంగా మారింది. గోవాలో తీరం వెంబడి నిర్మించిన విలాసవంతమైన హాలిడే హోమ్ లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. పర్యాటకులు వీటిలో ఉండటానికే మొగ్గు చూపిస్తారు కాబట్టి.. డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. ఈ కారణంగా వీటి అద్దెలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఫలితంగా యజమానులకు రాబడి కూడా గణనీయంగానే ఉంటుంది. అందువల్లే గోవాలో రియల్ పెట్టుబడులు ఆకర్షణీయ అంశంగా మారాయి.

This website uses cookies.