ఫ్యూచర్ సిటీ 4.O హైదరాబాద్ నగరాన్ని మరో లెవల్ కు తీసుకుపోనుందని రియాల్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత కొంత కాలంగా నెమ్మదించిన రియల్ ఎస్టేట్.. ఫ్యూచర్ సిటీ నిర్మాణం మొదలవ్వడంతో స్పీడ్ అందుకుంటుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరాన్ని మరో స్థాయికి తీసుకుపోవాలనే కృత నిశ్చయంతో ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అందులోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ 4.O నిర్మాణంపై గట్టి పట్టుదలతో, స్పష్టమైన ముందు చూపుతో ఉన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో కాదు ప్రపంచస్థాయిలో అభివృద్ది చేయాలన్నదే తన లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది.
ప్రస్తుత ప్రపంచ అవసరాలకు తగినట్లు నాలుగో నగరం ఫ్యూచర్ సిటీ 4.O ని నిర్మించేలా పక్కా కార్యాచరణతో ముందుకువెళ్తోంది రేవంత్ సర్కార్. తెలంగాణకు మొత్తం మూడు రింగ్స్ ఉండగా, మొదటిది కోర్ అర్బన్ ఏరియా హైదరాబాద్, రెండోది అవుటర్ రింగు రోడ్డు-రీజినల్ రింగు రోడ్డు మధ్య గల సెమీ-అర్బన్ ఏరియా, మూడవది రీజనల్ రింగ్ రోడ్ బయట ఉన్న గ్రామీణ తెలంగాణగా విభజించింది. అక్కడ అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో ఆసియాలోనే అత్యుత్తమ గ్రామాలను అభివృద్ధి చేస్తామని సీఎం అన్నారు.
ఫ్యూచర్ సిటీలో పెట్టుబడిదారులకు కావల్సిన అన్ని సౌకర్యాలు, అనుమతులు కల్పించేందుకు కావాల్సిన మౌలిక వసతులపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సింటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిటీ వంటి ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు కాగ్నిజెంట్ లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నారు. యువతకు మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో సుమారు 4 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అక్కడ ఆరోగ్య, క్రీడా హబ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు మెట్రోతో అనుసంధానం చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. వ్యవసాయం నుంచి మొదలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు అన్ని రంగాలు ఈ కొత్త నగరంలో ఉండేలా మాస్టర్ ప్లాన్ రేడీ అవుతోంది.
వైద్య సేవల నుంచి ఉపాధి వరకు లభించే పరిశ్రమలు, క్రికెట్ స్టేడియం నుంచి గోల్ఫ్ కోర్స్ వరకు స్పోర్ట్స్ క్లస్టర్స్ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దం చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఫార్మా సిటీ కోసం సేకరించిన దాదాపు 20 వేల ఎకరాల్లో వివిధ జోన్లుగా విభజించి అభివృద్ధి చేసేలా చర్యలు చేపడుతోంది.
ఐటీ హబ్‌లు, స్పోర్ట్స్ మైదానాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, పర్యాటకం, వినోదం అన్నింటికీ ఇక్కడ స్థానం ఉండేలా ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. అయితే, ఫ్యూచర్ సిటీ ప్రకటన రాగానే.. కొందరు రియల్టర్లు, ఏజెంట్లు, ల్యాండ్ లార్డ్స్ కలిసి.. మహేశ్వరం, ఇబ్రహీం పట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని భూముల ధరల్ని పెంచేస్తున్నారు. ఈ సిటీ మాస్టర్ ప్లాన్ పూర్తవ్వడానికే ఏడాది నుంచి ఏడాదిన్నర అవుతుంది. పనులు మొదలై పూర్తయ్యేసరికి.. మరో ఎలక్షన్ వస్తుంది. ఇలాంటి అంశాల్ని పట్టించుకోకుండా.. ఎవరికివారే రేట్లను పెంచుకుంటూ పోతే ఎలా? ధరల్ని పెంచడం ఒక్కటే రియల్ గ్రోత్ అవ్వదనే విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తించాలి.
This website uses cookies.