ఔను.. మీరు చదివింది నిజమే.. హైదరాబాద్‌లో సెప్టెంబరు 30 నాటికి అమ్మకానికి సుమారు 58,535 ఫ్లాట్లు ఉన్నాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ అనే సంస్థ వెల్లడించింది. జూన్ 30 నాటికి 50,580 ఫ్లాట్లు అమ్మకానికి ఉండగా.. జులై నుంచి సెప్టెంబరు 30 నాటికి 8000 ఫ్లాట్లు అదనంగా చేరాయని తెలియజేసింది. ఆ మూడు నెలల్లో కేవలం 6,735 ఫ్లాట్లు మాత్రమే అమ్ముడయ్యాయని తాజా నివేదికలో బహిర్గతం చేసింది. ఈ లెక్కన చూస్తే..
యాభై ఫ్లాట్లు అమ్మడానికి ఎంతకాలం పడుతుందో అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్న ఫ్లాట్లను అమ్మడానికి ఎంతలేదన్నా రెండున్నరేళ్లు పడితే.. ఈలోపు ప్రతినెలా పెరిగే కొత్త ఫ్లాట్లను అమ్మకానికి ఎంతలేదన్నా మరికొన్నేళ్లు పడుతుందని చెప్పొచ్చు. అందుకే, హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం ఫ్లాట్ల సరఫరా అధికంగా ఉంది. దీనికి తోడు, యూడీఎస్ మరియు ప్రీలాంచ్ అమ్మకాల్లో అధిక శాతం మంది బిల్డర్లు ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. మరి, వీటి సంఖ్యను లెక్కిస్తే.. ఈ స్టాకు మొత్తం అమ్ముడు అవ్వడానికి ఎంతలేదన్నా ఐదారేళ్లు పడుతుంది.