బంగారం.. ఈ పేరు వినగానే మహిళల మనసు పులకించిపోతుంది. భారతీయ సంస్కృతిలో బంగారానికి, మహిళలకు ఉన్న బంధం ఎంతో ప్రత్యేకమైనది. అయితే బంగారంపై ఎంతో ఇష్టం చూపించే మహిళల వైఖరిలో ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. అవును.. పసిడి కొనేందుకు బదులు ఆ డబ్బును స్థిరాస్తిపై పెట్టుబడిగా పెడుతున్నారు నేటి తరం మహిళలు. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం దాదాపు లక్ష రూపాయలకు చేరువ అవుతున్న నేపథ్యంలో బంగారం వద్దు ఇల్లే ముద్దు అంటున్నారు మహిళలు.
భారతీయ సంప్రదాయంలో బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులోను ఆడవాళ్లకు బంగారమంటే ఎంతో మక్కువ. బంగారాన్ని అలంకరించుకోవడం సంస్కృతిలో ఓ భాగమని అనుకుంటారు. అంతే కాదు బంగారాన్ని ఓ రకమైన ఆస్థిగా కూడా పరిగణిస్తారు. అందుకే చాలా మంది మహిళలు కేవలం అలంకరించుకోవడానికి మాత్రమే కాకుండా డబ్బులను బంగారంపై పెట్టుబడిగా కూడా పెడుతుంటారు. చాలా మంది షేర్ మార్కెట్లతో పాటు బంగారంపై ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు మహిళల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. డబ్బులుంటే చాలు బంగారం కొనాలనుకునే చాలా మంది మహిళల దృక్పథం మారింది. పొదుపు చేసుకున్న డబ్బులను బంగారం కంటే ఎక్కువ రాబడి ఇచ్చే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడిగా పెడుతున్నారు మహిళలు.
బంగారానికి బదులు ఈ మధ్య కాలంలో మహిళలు ఎక్కువగా స్తిరాస్థి రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. స్వతంత్ర గృహ కొనుగోలు, పెట్టుబడిదారులుగా ఎదుగుతున్నారు. ప్రస్తుతం బంగారం ధర ఆకాశాన్నంటుతోంది. 10 గ్రాముల బంగారం ధర దాదాపు లక్ష రూపాయలకు చేరువగా ఉంది. ఐతే ఇకపై పసిడి ధర పెద్దగా పెరగకపోవచ్చని వ్యాపారరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే బంగారం కొని ఇంట్లో పెట్టుకుంటే స్వల్పంగానే విలువ పెరుగుదల ఉంటుందని, కానీ బంగారానికి బదులు స్తిరాస్థి కొంటే త్వరగా పెట్టుబడి విలువ పెరుగుతుందని మహిళలు భావిస్తున్నారు. దీంతో బంగారమే కాదు రియల్ఎస్టేట్ ను పెట్టుబడి కోణంలో చూసే మహిళల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. తాము ఉండేందుకు గృహాలను కొనుగోలు చేయాలని భావించే మహిళలతో పాటు కేవలం పెట్టుబడుల కోసం ఇంటిని కొనుగోలు చేస్తున్న మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోందని రియల్ రంగ మార్కెటింగ్ నిపుణులు చెబుతున్నారు.
అయితే ఎక్కువ శాతం మంది మహిళలు తక్కువ బడ్జెట్ తో వచ్చే ఇంటిపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కొంతమేర స్పీడ్ తగ్గింది. అందులోను హైదరాబాద్ లో గత యేడాదిన్నరగా నిర్మాణరంగం చతికిలపడిపోయింది. మళ్లీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇదే సమయంలో బంగారం ధర అమాంతం పెరిగిపోయింది. అందుకే బంగారంపై కంటే కూడా మరి కొన్ని ఎక్కువ డబ్బులు పెట్టుబడిగా పెట్టి, అవసరమైతే బ్యాంకు లోన్ తీసుకుని ఇల్లు లేదా ఇంటి స్థలం కొనగోలుచేయడం ఉత్తమమని మహిళలు భావిస్తున్నారని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఇళ్ల ధరలు అందుబాటులో ఉండటం కూడా కలిసివస్తోందని అంటున్నారు. గతంలో తక్కువ ధరకు కొనుక్కున్న బంగారాన్ని ఇప్పుడు మార్కెట్ ను బట్టి ఎక్కున ధరకు అమ్మేసి స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెడుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. అందుకే ఇంట్లోనే కాదు ఇంటి కొనుగోలు ఎంపికలోనూ తమదే పైచేయని నిరూపిస్తున్నారు నేటి తరం మహిళలు.