థ్యాంక్స్ టూ సీఎం
రేవంత్ రెడ్డి & టీమ్
హైదరాబాద్‌లో ప్రపంచంలోనే టాప్ సిటీగా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారు. తెలంగాణకు పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు అమెరికాలో ఆయన పర్యటన విజయవంతం అయ్యిందని చెప్పొచ్చు.ఈ క్రమంలో ఆయన బృందం పలువురు గ్లోబల్ బిజినెస్ లీడర్లతో సమావేశమయ్యారు. తమ ప్రభుత్వం తలపెట్టిన ప్రపంచ స్థాయి అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని కోరారు. సీఎం ప్రణాళికల్ని విని.. ఆయనిచ్చే భరోసాను చూసి.. ప్రపంచస్థాయి బిజినెస్ లీడర్లు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. మొత్తానికి, ఫ్యూచర్ స్టేట్ తెలంగాణకు పెట్టుబడుల్ని తేవడంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులతో కూడిన బృందం విజయవంతమైందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో అడుగుపెడతామని.. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న పలు సంస్థలు.. హైదరాబాద్‌కు విచ్చేసి.. కార్యాలయాల్ని ఏర్పాటు చేస్తే.. మనవాళ్లకు కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. ఫలితంగా, తెలంగాణ ఎకానమీ బూస్ట్ అవుతుంది. తొలుత అద్దె ఇళ్లు, సర్వీస్ అపార్టుమెంట్లకు గిరాకీ పెరుగుతుంది. రెస్టారెంట్లు, షాపింగ్ మాళ్లు, ఫుడ్ కోర్టులు, మల్టీప్లెక్సులు, క్యాబ్ సర్వీసెస్ వంటి వాటికి ఆదరణ రెట్టింపౌతుంది. కొన్నాళ్లయ్యాక.. అందులో కొంత శాతం మంది సొంతిళ్లనూ కొనుగోలు చేస్తారు. మొత్తానికి, తెలంగాణ సీఎం కృషి వల్ల.. హైదరాబాద్‌లో రియల్ రంగానికి మంచి రోజులొస్తున్నాయని చెప్పొచ్చు. మరి, ఏయే కంపెనీలు ఇక్కడికొచ్చేందుకు అంగీకరించాయంటే..
అమెరికాలోనే అతి పెద్ద బయో టెక్నాలజీ కంపెనీ ఆమ్జెన్ (AMGEN) తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించనుంది. హైదరాబాద్ లో కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విభాగం ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. హైటెక్ సిటీలో ఆరు అంతస్తుల భవనంలో ఈ సెంటర్ ఉంటుంది. దాదాపు 3 వేల మందికి ఇక్కడ ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ఏడాది చివరి త్రైమాసికం నుంచే కంపెనీ తమ కార్యకలాపాలు ప్రారంభించనుంది. ప్రపంచంలో పేరొందిన బయోటెక్ సంస్థ హైదరాబాద్‌ను తమ కంపెనీ అభివృద్ధి కేంద్రంగా ఎంచుకోవటం గర్వించదగ్గ విషయం. బయో టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ ప్రాధాన్యం మరింత ఇనుమడిస్తుంది. ప్రపంచ స్థాయి సాంకేతికతతో రోగులకు సేవ చేయాలని కంపెనీ ఎంచుకున్న లక్ష్యం ఎంతో స్పూర్తిదాయకంగా ఉంది.
సీఎం రేవంత్ రెడ్డి ప్రఖ్యాత అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్ తో ఇటీవల భేటీ అయ్యారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం తలపెట్టిన హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ నిర్మాణం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు ప్రణాళికలపై శంతను నారాయణ్ ఆసక్తి కనబరిచారు. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు అంగీకరించారు.
ఫైనాన్షియల్ సర్వీసెస్లో ప్రపంచంలో పేరొందిన చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్ లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. భారత్లోనే ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్ ఇదే కావటం విశేషం. హైదరాబాద్‌లో ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కంపెనీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తామని చెప్పారు. తమ కంపెనీ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతుకు కంపెనీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు ఛార్లెస్ స్క్వాబ్ తుది అనుమతుల కోసం వేచి చూస్తోంది. త్వరలోనే తమ ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్‌కి పంపించనుంది.
తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు ప్రపంచ బ్యాంక్ సంసిద్ధతను వ్యక్తం చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు కలిసికట్టుగా రోడ్ మ్యాప్ను రూపొందించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ప్రధానంగా స్కిల్ డెవెలప్మెంట్, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, నెట్ జీరో సిటీ, ఆరోగ్య సంరక్షణ, డయాగ్నస్టిక్స్, హెల్త్ ప్రొఫైల్ రంగాల్లో భాగస్వామ్యానికి అవసరమైన సంప్రదింపులు జరిగాయి. వివిధ అంశాలపై దాదాపు గంటసేపు చర్చలు జరిపారు.
ప్రపంచంలో పేరొందిన వివింట్ ఫార్మా కంపెనీ హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఈ కంపెనీ ముందుకు వచ్చింది. దీంతో దాదాపు 1000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటికే లైఫ్ సైన్సెస్‌కు గ్లోబల్ హబ్‌గా ఎదుగుతున్న తెలంగాణలో ఈ కంపెనీ పెట్టుబడులకు సిద్ధపడటం అందరినీ ఆకర్షిస్తోంది.
ప్రపంచంలో పేరొందిన కార్నింగ్ ఇన్ కార్పొరేటేడ్ కంపెనీ తెలంగాణలో కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకు వచ్చింది. నైపుణ్యాలతో పాటు పరిశ్రమల్లో సాంకేతిక ఆవిష్కరణలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం అడ్వాన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో కార్నింగ్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వానికి పరస్పర సహకారం అందిస్తుంది. ఫార్మాస్యూటికల్, కెమికల్ రంగాల్లో అత్యాధునిక పరిశోధన, అభివృద్ది కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంతో భాగస్వామ్యం పంచుకుంటుంది.
టెక్నాలజీ, సర్వీస్ సొల్యూషన్స్ లో పేరొందిన ఆర్సీసియం కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించనుంది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఆర్సీసియం మొదటిసారిగా హైదరాబాద్ లో తమ ఆఫీసును విస్తరించనుంది. అమెరికా తర్వాత విదేశాల్లో కంపెనీ పెట్టడం ఇదే మొదటి సారి. ప్రపంచవ్యాప్తంగా తమ సేవల విస్తరణకు హైదరాబాద్ సెంటర్ కీలకంగా నిలుస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో 500 మంది అత్యాధునిక సాంకేతిక నిపుణులను కంపెనీ నియమించనుంది. డీఈ షా గ్రూప్, బ్లాక్‌స్టోన్ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ మద్దతుతో ఆర్సెసియం స్వతంత్ర సంస్థగా ప్రారంభమైంది. బ్యాంకులు, హెడ్జ్ ఫండ్‌లు, సంస్థాగత ఆస్తుల నిర్వాహకులు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు సంబంధించిన డేటాతో పాటు కార్యకలాపాలపై ఈ కంపెనీ విశ్లేషణలు అందిస్తుంది.
ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ హైదరాబాద్ లో తమ అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సెంటర్ నెలకొల్పనుంది. ఈ కంపెనీ డేటా అనలిటిక్స్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్‌లకు అవసరమయ్యే ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ అందిస్తుంది. రాబోయే మూడేండ్లలో 1,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకొని శిక్షణను అందిస్తుంది. ఈ కంపెనీ మొత్తం ఆదాయం 160 మిలియన్ డాలర్లకు పైగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీలో పని చేస్తున్న 2,500 మందిలో వెయ్యి మంది మన దేశంలో ఉండగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో వంద మంది ఉన్నారు. మరో ఆరు నెలల్లోనే తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ఈ కంపెనీ ప్రకటించింది.
అమెరికాకు చెందిన వాల్ష్ కర్రా హోల్డింగ్స్ తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధపడింది. వీ హబ్ లో రూ.42 కోట్ల (5 మిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. రానున్న ఐదేళ్లలో వీ హబ్ తో పాటు తెలంగాణలో నెలకొల్పే స్టార్టప్ లలో దాదాపు రూ.839 కోట్ల (వంద మిలియన్ డాలర్ల) పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. వాల్ష్ కర్రా కంపెనీకి చెందిన ఫణి కర్రా, గ్రేగ్ వాల్ష్, వీ హబ్ సీఈవో సీతా పల్లచోళ్ల ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దేశంలోనే వినూత్నంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు వీ హబ్ ను ఏర్పాటు చేసింది.
ప్రపంచస్థాయి ఐటీ రంగంలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికతో ముందుకు వచ్చింది. హైదరాబాద్ లో దాదాపు 15 వేల మంది ఉద్యోగులకు పని కల్పించేలా కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్టు ప్రకటించింది. ఇరవై వేల మంది ఉద్యోగులుండేలా పది లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ సెంటర్ ను స్థాపించనుంది.
This website uses cookies.