రేటు తక్కువని ఊరిస్తున్నా.. ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను కొనకూడదని రియల్ ఎస్టేట్ గురు కొంతకాలం నుంచి హెచ్చరిస్తూనే ఉంది. కేవలం రేటును చూసి కొనుగోలు చేయకూడదని.. బిల్డర్ కు ఫ్లాట్లను కట్టే సామర్థ్యం ఉందా? లేదా? అనే అంశాన్ని గమనించి.. తుది నిర్ణయం తీసుకోవాలని చెబుతూనే ఉంది. అయినా, కొంతమంది అమాయక కొనుగోలుదారులు.. తక్కువ రేటును చూసి.. ఉన్న సొమ్మంతా ఊడ్చేసి.. బిల్డర్ల చేతిలో పోసి అడ్డంగా బుక్ అవుతున్నారు.
రాజమండ్రిలో రాఖీ ఎవెన్యూస్ చేసిన ప్రీలాంచ్ మోసం చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. కొనుగోలుదారులు ఎంత అమాయకంగా ఉన్నారంటే.. యాంకర్ సుమను చూసి ఫ్లాట్లను కొన్నామంటూ చెప్పడాన్ని చూసి మతిపోతుంది. ప్రజలు ఇంత అమాయకంగా ఉండటం వల్లే కొందరు డెవలపర్లు మోసం చేస్తూనే ఉన్నారు.
15 లక్షలకే డబుల్ బెడ్‌రూం.. 19 లక్షలకే ట్రిపుల్ బెడ్‌రూం.. మార్కెట్ రేటు కంటే సగానికే.. ఇంతకుమించిన బంపర్ ఆఫర్ లేదు.. ఇలా టీవీ కార్యక్రమాల్లో హోరెత్తించారు. అప్పటికే పూర్తి చేసిన ఒక ప్రాజెక్టును చూపెట్టి.. బుల్లితెర యాంకర్ సుమ, రాజీవ్ కనకాలతో ప్రత్యేక యాడ్స్ చేయించి.. రియల్ ఎస్టేట్ కార్యక్రమాల్లో.. ఇతర ప్రసార మాధ్యమాల్లో ప్రకటనల వర్షం కురిపించారు. టీవీ యాంకర్లైన రవి, శ్యామలతో ప్రాయోజిత ప్రోగ్రాముల్ని చేయించారు.. ఇంతమంది చెబుతుంటే నిజమేనని నమ్మిన అమాయక ప్రజలు.. వంద శాతం సొమ్మంతా తీసుకొచ్చి సంస్థ చేతిలో పోశారు. కొందరు పిల్లల చదువుల కోసమని.. మరికొందరు పెళ్లిళ్ల కోసమని..
ఇంకొందరేమో పెట్టుబడి నిమిత్తమని.. ఇలా రకరకాల అవసరాల కోసం.. రాఖీ ఎవెన్యూస్ చంద్రికా అవంతిక ఫేజ్ 2 లో ఫ్లాట్లను కొనుగోలు చేశారు. నాలుగేళ్లయినా పునాది కూడా పడకపోవడంతో కొనుగోలుదారుల్లో సందేహాలు చుట్టిముట్టాయి. సంస్థను సంప్రదిస్తే సమాచారం లేదు. మార్కెటింగ్ చేసినవారంతా చేతులెత్తేశారు. హైదరాబాద్‌కు వచ్చి సంస్థను అడిగినా జవాబు లేదు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన కొనుగోలుదారులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. కన్నీటిపర్యంతమయ్యారు. ఎంతో సౌమ్యంగా మాట్లాడే సంస్థ ఎండీ రామయ్య వేణు.. తమను ఇలా మోసం చేస్తారని కలలో కూడా కలగనలేదని విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడు తమకెవరు న్యాయం చేస్తారంటూ మీడియా ముందుకొచ్చారు.
రాఖీ ఎవెన్యూస్‌లో ఫ్లాట్లు కొన్నవారు.. రాజమండ్రి ప్రెస్ క్లబ్‌లో.. ఒక్కొక్కరు తమ అనుభవాల్ని వివరిస్తుంటే.. వాటిని విని ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సంస్థ ఎండీ మీద ఎంతో నమ్మకంతో ఉన్నారో.. వారి మాటల్ని వింటుంటేనే అర్థమవుతుంది. పైగా, అధిక శాతం మంది పలు టీవీ ఛానెళ్లల్లో యాంకర్ సుమను చూసి ఫ్లాట్లను కొనుగోలు చేశామని చెబుతుంటే ముక్కుమీద వేలేసుకోవాల్సిందే. అంటే, ప్రకటనల్లో నటించేవారు డబ్బులు తీసుకుని నటిస్తారని..
అంతేతప్ప, ఆ ప్రాజెక్టుకు సదరు నటీనటులకు ఎలాంటి సంబంధం ఉండదనే విషయం కూడా తెలియని ఈ అమాయక ప్రజల్ని.. రాఖీ ఎవెన్యూస్ సంస్థ అడ్డంగా మోసిగించింది. ఆ సంస్థతో తనకు సంబంధం లేదంటూ.. యాంకర్ సుమ ఇందుకు సంబంధించిన వివరణ కూడా విడుదల చేయడం గమనార్హం. రాఖీ ఎవెన్యూస్ సంస్థ ఎండీ రామయ్య వేణుకి ఉన్న ఆస్తుల్ని విక్రయించకుండా ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని.. తమ సొమ్మును వెనక్కి ఇప్పించేందుకు ప్రభుత్వమే సాయం చేయాలని బాధితులు విన్నవించుకుంటున్నారు.
This website uses cookies.