తక్కువ రేటుకు ఫ్లాట్ కొనొచ్చు
బిల్డర్లతే బేరమాడే వీలుంది
ఏడు నెలల్నుంచి తగ్గిన సేల్స్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హైదరాబాద్‌లో ఫ్లాట్ల అమ్మకాలు మందగించాయి. సొంతిల్లు కొనుక్కోవాలని ఆరాటపడేవారు.. అవసరమైతే ఒకట్రెండు గంటలు బిల్డర్ వద్ద కూర్చోని.. చర్చించి.. రేటు గురించి బేరమాడి.. తుది నిర్ణయానికి వస్తున్నారు. కాకపోతే, గతంలో ఉన్నంత స్థాయిలో ప్రస్తుతం అమ్మకాలైతే జరగట్లేదు. ఎందుకంటే, అధిక శాతం మంది వేచి చూసే ధోరణీని అవలంబిస్తున్నారు. ఈ క్రమంలో.. నగరంలో ఎప్పటికైనా ఓ సొంతిల్లు కొనుక్కోవాలని భావించే వారికి ఇంతకు మించిన తరుణం లేదని చెప్పొచ్చు.
ప్రస్తుతం హైదరాబాద్ రియాల్టీ మార్కెట్లో నెలకొన్నది బయ్యర్స్ మార్కెట్. గత ఏడు నెలల్నుంచి గమనిస్తే.. ఎక్కడా ఫ్లాట్ల ధరలు పెరిగిన దాఖలాల్లేవు. కొత్తగా ఆరంభమైన ప్రాజెక్టుల్ని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అసలు కొత్త ప్రాజెక్టుల్ని మొదలెట్టడానికి డెవలపర్లూ పెద్దగా ఆసక్తి చూపెట్టడం లేదు. అందుకే, ఇది బయ్యర్ల మార్కెట్ అని ఘంటాపథంగా చెప్పొచ్చు. అందుకే, ఫ్లాట్లను కొనుక్కోవాలని భావించేవారికి ఇది చక్కటి తరుణమని చెప్పొచ్చు. ఎందుకో తెలుసా?
ప్రస్తుతం మన రియాల్టీ మార్కెట్లో నెగటివ్ సెంటిమెంట్ నెలకొంది. పెట్టుబడిదారుల్లో కొంతమంది అమరావతి వైపు దృష్టి సారించారు. ఫ్లాట్లను కొనాలని భావించేవారు వేచి చూసే ధోరణీని అవలంబించారు. కాబట్టి, ఇదే సమయంలో డెవలపర్లతో ధర గురించి బేరమాడి.. గతంతో పోల్చితే కాస్త తక్కువ రేటుకే ఫ్లాటును కొనుగోలు చేయవచ్చు. గతంతో పోల్చితే ఎంతలేదన్నా పది, పదిహేను శాతం తక్కువకే కొన్ని ప్రాజెక్టుల్లో ఫ్లాట్ లభించేందుకు ఆస్కారముంది. అయితే, నగదు కొరతను ఎదుర్కొంటున్న డెవలపర్ వద్ద కొంత తక్కువకు ఫ్లాట్ దొరుకుతుంది. అందుకే, తక్కువ రేటులో సొంతింటిని సొంతం చేసుకోవాలని భావించేవారికిదే సరైన సమయం అని ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలి. నిన్నటి వరకూ బయ్యర్ల మొహం కూడా చూడటానికి ఇష్టపడని బిల్డర్లు.. ఇప్పుడు బయ్యర్ల కోసం కాచుకోని కూర్చున్నారనే విషయాన్ని మర్చిపోవద్దు