Categories: LATEST UPDATES

ఆక్రమణలపై సర్కారు విచారణ

ఇటీవల కురిసిన వర్షాలతో ముంపు బారిన పడి విలవిలలాడిన న‌గ‌రంలో మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా చూసేందుకు సర్కారు చర్యలు ప్రారంభించింది. వరద నీటి ప్రవాహం కోసం ఏర్పాటు చేసిన నాలాలతోపాటు చెరువులను సైతం ఆక్రమించేసి అక్రమంగా కట్టడాలు కట్టడంతో నగరం ముంపు బారిన పడినట్టు అర్థమైంది. ఈ వ్యవహారం అసెంబ్లీని సైతం కుదిపేయడంతో సర్కారు కఠిన చర్యలకు ఉపక్రమించింది. బిల్డర్లే కాకుండా ప్రభుత్వ సంస్థలకు సైతం ఈ పాపంలో భాగం ఉండటం గమనార్హం.

సాక్షాత్తూ బెంగళూరు డెవలప్ మెంట్ అథార్టీ 23 చెరువులను లేఔట్లుగా మార్చి 3500 ప్లాట్లను పంపిణీ కూడా చేసింది. బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) ఐదు చెరువులను మింగేసిందని తేలింది. ఈ నేపథ్యంలో చెరువులు, వరదనీటి కాల్వలపై జరిగిన ఆక్రమణల నిగ్గు తేల్చేందుకు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై విచారణకు ఆదేశించారు. ఇందుకోసం జ్యుడీషియల్ అధికారితోపాటు ఇద్దరు నిపుణులతో కమిటీని వేశారు.

వచ్చే మూడు నాలుగేళ్లలో తగిన చర్యలు చేపట్టి నగరాన్ని ముంపు బారి నుంచి కాపాడతామని స్పష్టంచేశారు. కాగా, హైదరాబాద్ లో చెరువులు ఆక్రమించుకుని, వాటిని పూడ్చేసి నిర్మాణాలు చేపట్టిన బిల్డర్లపై కూడా మన ప్రభుత్వం విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇష్టారీతిన చెరువులను కబ్జా చేసి లేఔట్లు వేసి జనాన్ని మోసం చేస్తున్నవారిని ఉపేక్షించొద్దని పలువురు కోరుతున్నారు.

This website uses cookies.