దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో గోడౌన్ల వసతుల్లో వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని ఇక్రా రేటింగ్స్ అంచనా వేసింది. పారిశ్రామిక, వేర్ హౌస్ లాజిస్టిక్స్ పార్క్ సరఫరా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13 నుంచి 15 శాతం మేర పెరుగుతుందని పేర్కొంది.
ప్రస్తుతం దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో 435 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో గోదాములు రాబోతున్నాయని.. ఇందులో సగం మేర గోదాములు గ్రేడ్ ఏ కిందకే వస్తాయని వివరించింది. అయితే, కొత్తగా వచ్చే వసతిలో వినియోగం 39 మిలియన్ చదరపు అడుగులుగానే ఉంటుందని పేర్కొంది. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ (రవాణా), ఆటోమొబైల్ రంగాల నుంచి గోదాముల పరిశ్రమ స్థిరమైన డిమాండ్‌ను చూస్తోందని, 2023 మార్చి నాటికి మొత్తం వేర్‌హౌసింగ్ లీజు విస్తీర్ణంలో ఈ రంగాల వాటా 53 శాతంగా ఉందని వివరించింది. దీనికి అదనంగా ఈ కామర్స్, అనుబంధ సేవల రంగాలు వేగంగా విస్తరిస్తుండడం కూడా గోదాములకు డిమాండ్‌ను పెంచుతోందని తెలిపింది.