ఈనెల 10 నుంచి 22 సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌ల్లో ప్రారంభం
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సమర్థవంతంగా సులువుగా, వేగవంతంగా, పారదర్శకంగా, అవినీతిరహితంగా మరింత మెరుగైన సేవలను అందించేందుకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునీకరిస్తున్నారు. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి నిరీక్షించే పనిలేకుండా కేవలం 10 నుంచి 15 నిమిషాలలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకురాబోతున్నారు. రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు గాను మొదటి దశలో ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈనెల 10వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలులోకి తీసుకురాబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మంత్రి పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు.
22 ఆఫీస్‌లు ఇవే
హైదరాబాద్‌లోని ఆజంపుర, చిక్కడపల్లి, సంగారెడ్డి జిల్లా సదాశివపేట, మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్, వల్లభ్ నగర్, రంగారెడ్డి జిల్లా శంషాబాద్, సరూర్ నగర్, చంపాపేట్, పెద్దపల్లి జిల్లా రామగుండం, ఖమ్మం జిల్లా కూసుమంచి, ఖమ్మం (R.O), మేడ్చల్ (R.O), మహబూబ్ నగర్(R.O), జగిత్యాల, నిర్మల్, వరంగల్ ఫోర్ట్, వరంగల్ రూరల్, కొత్తగూడెం, ఆర్మూర్, భువనగిరి, చౌటుప్పల్, నాగర్ కర్నూల్ మొత్తం 22 చోట్ల ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని మంత్రి తెలిపారు. సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఒకేరోజు ఒకే సమయంలో ఎక్కువ దస్తావేజులు రిజిస్ట్రేషన్ కోసం సమర్పించడం వలన జరిగే జప్యాన్ని నివారించడానికి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ రోజు వారి పని వేళలను 48 స్లాట్లుగా విభజించడం జరిగిందన్నారు. ప్రజలు నేరుగా “registration.telangana.gov.in” వెబ్-సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయానికి స్లాట్ బుక్ చేసుకుని ఆ రోజు నిర్ధేశించిన సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని వెంటనే వెళ్లిపోవచ్చన్నారు. స్లాట్ బుక్ చేసుకోనివారికోసం ఏదైనా అత్యవసర సందర్భాలలో ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు, ఐదు వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లను అనుమతిస్తారని, నేరుగా కార్యాలయానికి వచ్చిన వారికి ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్దతిలో దస్తావేజులు స్వీకరిస్తారని తెలిపారు.
అధిక రద్దీ కార్యాలయాల్లో అదనపు సిబ్బంది నియామకం
పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని సులభతరం చేయడానికి మరియు 48 స్లాట్స్ కన్నా ఎక్కువ స్లాట్స్ అవసరం ఉన్న కార్యాలయాలలో ఇప్పుడున్న సబ్ రిజిస్ట్రార్లకు తోడుగా అదనపు సబ్ రిజిస్ట్రార్లను నియమిస్తామని, ప్రయోగాత్మకంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ కార్యాలయంలో అదనంగా ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు మరియు సిబ్భందిని నియమించడం జరిగిందని, దీనివలన కుత్బుల్లాపూర్ కార్యాలయంలో 144 స్లాట్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. స్లాట్ బుకింగ్ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను రీ ఆర్గనైజేషన్ చేస్తున్నామని, ఇందులో భాగంగా అధిక రద్దీ, తక్కువ రద్దీ ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిని అనుసంధానం చేసి పనిభారాన్ని సమానం చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ విధానాన్ని ముందుగా రంగారెడ్డి జిల్లాలోని చంపాపేట – సరూర్ నగర్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల అధికార పరిధిని విలీనం చేయడం జరిగిందని తెలిపారు.
దస్తావేజులను స్వయంగా తయారు చేసుకోవచ్చు
రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రజలు ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా దస్తావేజులను తయారు చేసుకోవడానికి వెబ్ సైట్ లో ఒక మాడ్యూల్ ని ప్రవేశపెట్టామని మొదటగా సేల్ డీడ్ దస్తావేజుల కోసమే ఈ సౌకర్యం ఉంటుందని ఇది కూడా ఐచ్చికమేనని తెలిపారు. రిజిస్ట్రేషన్ సమయంలో దస్తావేజు పైన అమ్మినవాళ్ళు, కొన్నవాళ్లు, సాక్షులు మరియు సబ్ రిజిస్ట్రార్ వ్యక్తిగతంగా/భౌతికంగా సంతకాలు చేయడానికి చాలా సమయం పట్టడం వలన దస్తావేజు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా ఆలస్యమవుతుంది. దీని వలన ప్రజల సమయం వృధా అవడం ద్వారా ఇబ్బందులు పడుతున్నారు. దీనిని నివారించడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంలో భాగంగా ఆధార్ ఇ-సంతకం ప్రవేశపెడుతున్నామని ఈనెల చివరిలోగా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
డబుల్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ
ప్రతిరోజు ఎక్కడో ఒకచోట మా ఆస్తి డబుల్ రిజిస్ట్రేషన్ జరిగిందనే ఫిర్యాదులు ప్రజల నుండి ఎక్కువగా వస్తున్నాయని, డబుల్ రిజిస్ట్రేషన్ లను నివారించడానికి చట్టాన్ని సవరించబోతున్నామని తెలిపారు. డబుల్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి వివిధ రాష్ట్రాలు ఇప్పటికే చట్టాలను సవరించుకున్నాయని, అదేవిధంగా తెలంగాణలో కూడా చట్టసవరణ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని రిజిస్ట్రేషన్ చట్టంలో కొత్తగా సెక్షన్స్ 22 కి సవరణ చేస్తూ సెక్షన్ 22-బి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు.