- భాగ్యనగరంలో గత 12 నెలల్లో 10 శాతం మేర పెరిగిన ధరలు
- దేశంలోని ఇతర నగరాల్లో 6 శాతం లోపే పెరుగుదల
హైదరాబాద్ లో రియల్ ధరలు జోరుగా పరుగులు తీస్తున్నాయి. దేశంలోని ఏ నగరంలోనూ లేనంత ఎక్కువగా హైదరాబాద్ లో ఇళ్ల ధరలు పెరుగుతున్నాయి. గత 12 నెలల కాలాన్ని పరిశీలిస్తే.. హైదరాబాద్ రియల్ మార్కెట్ లో ఇళ్ల ధరలు 10 శాతం పెరగ్గా.. దేశంలోని మిగిలిన నగరాల్లో ఇది 6 శాతానికి కంటే ఎక్కువ లేదు. అదే గత ఆరు నెలల లావాదేవీలను పరిశీలిస్తే.. భాగ్యనగరంలో ఇళ్ల రేట్లు 9 శాతం పెరగ్గా.. మిగిలిన నగరాల్లో 4 శాతం మించలేదు.
ఈ వివరాలను నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. హైదరాబాద్ లో చదరపు అడుగు కనీస ధర రూ.5,410గా ఉన్నట్టు క్రెడాయ్ నివేదిక పేర్కొంది. ముంబైలో అత్యధికంగా చదరపు అడుగు కనీస ధర రూ.7,593గా ఉండగా.. గత 12 నెలల్లో అక్కడి ఇళ్ల ధరలు 6శాతం, గత 6 నెలల్లో 3 శాతం మాత్రమే పెరిగాయి. ముంబై తర్వాత బెంగళూరులో చదరప అడుగు కనీస ధర రూ.5,643గా ఉంది. ఇక్కడ గత 12 నెలల్లో 5 శాతం, గత ఆరు నెలల్లో 2 శాతం మాత్రమే ఇళ్ల ధరల్లో పెరుగుదల నమోదైంది. కానీ హైదరాబాద్ లో మాత్రం ఇళ్ల ధరలు తారాజువ్వలా దూసుకెళ్తున్నాయి.
ఒకప్పుడు దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్ లోనే ఇళ్ల ధరలు తక్కువగా ఉండేవి. కానీ తాజా పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. ప్రస్తుతం నగరంలో ప్రీమియం ప్రాజెక్టులే ఎక్కువగా వస్తున్నాయి. వాటికే జనం నుంచి డిమాండ్ ఉన్నందున బిల్డర్లు ప్రీమియం, అల్ట్రా ప్రీమియం ప్రాజెక్టుల నిర్మాణానికే మొగ్గు చూపుతున్నారు. ఆయా వర్గాల నుంచి స్పందన కూడా అదే విధంగా వస్తోంది. అయితే, ఇదే సమయంలో సరసమైన ఇళ్లు దొరకడం గగనమైపోయింది. దీంతో నగర శివార్లలో సైతం రూ.60 లక్షలు వెచ్చిస్తేనే ఫ్లాట్ దొరుకుతోంది. ఇక రూ.50 లక్షల లోపు ధర కలిగిన ఇళ్ల వాటా హైదరాబాద్ లో 13 శాతం మాత్రమే ఉంది. ఢిల్లీలో కూడా 13 శాతమే ఉండగా.. భూముల ధరలు అత్యధికంగా ఉండే ముంబైలో అత్యధికంగా 46 శాతం ఉండటం విశేషం. పుణెలో 42 శాతం, చెన్నైలో 39 శాతం, బెంగళూరులో ఇది 20 శాతంగా ఉంది.