భూమి విలువపై జీఎస్టీ వర్తించదు
గుజరాత్ హైకోర్టు స్పష్టీకరణ
ఇళ్ల కొనుగోలుదారులకు గుజరాత్ హైకోర్టు భారీ ఊరట కల్పించింది. నిర్మాణ వ్యయం పైనే జీఎస్టీ చెల్లించాలని, భూమి విలువకు జీఎస్టీ వర్తించదని స్పష్టం చేసింది. ఫ్లాట్, విల్లా లేదా వాణిజ్య ఆస్తులకు సంబంధించి వాటి వాస్తవ భూమి విలువ లేదా అవిభాజ్య వాటా జీఎస్టీ పరిధిలోకి రాదని తేల్చి చెప్పింది. కేవలం నిర్మాణ వ్యయం మాత్రమే జీఎస్టీ పరిధిలోకి వస్తందని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ నిషా ఎం ఠాకూర్ లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.
అడ్వొకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్న పిటిషనర్ ఓ ప్లాట్ కొనుగోలు కోసం నవరత్న ఆర్గనైజర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతేకాకుండా ఆ ప్లాట్ లో బంగ్లా కూడా నిర్మించి ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నారు. జీఎస్టీ సహా అన్ని పన్నులూ కొనుగోలుదారే భరించాలని క్లాజ్ పెట్టుకున్నారు. జీఎస్టీ చట్టం 2017 ప్రకారం నిర్మాణ వ్యయం పైనే జీఎస్టీ చెల్లించాల్సి వస్తుందని పిటిషనర్ భావించారు. అయితే, భూమి విలువతోపాటు మొత్తం నిర్మాణ వ్యయంపై 18 శాతం జీఎస్టీ చెల్లించాలని, ఇందులో భూమి విలువ మూడింట ఒక వంతు తగ్గించిన అనంతరం వచ్చే మొత్తంపై జీఎస్టీ చెల్లించాలని నవరత్న సంస్థ పేర్కొంది. దీంతో పిటిషనర్ విభేదించారు. జీఎస్టీ అనేది వస్తు, సేవలపై విధించే పన్ను అని.. ఇక్కడ భూమి అనేది వస్తువు లేదా సేవల పరిధిలోకి రాదని వాదించారు. అనంతరం ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న న్యాయస్థానం.. భూమి విలువ జీఎస్టీ పరిధిలోకి రాదని పేర్కొంటూ తీర్పు వెలువరించింది.