Categories: TOP STORIES

హరిత భవనాలకు గుజరాత్ ప్రోత్సాహకాలు.. తెలంగాణలో ఎప్పుడు?

స్థిరమైన అభివృద్ధిని మరింతగా పెంపొందించే ఉద్దేశంతో హరిత భవనాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ) ఇంటెన్సివ్ రూపంలో దీనిని ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఎఫ్ఎస్ఐ అనేది గ్రీన్ రేటింగ్ ఫర్ ఇంటెగ్రేటెడ్ హాబిటెట్ అసెస్ మెంట్ (గ్రిహ), ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ), లీడర్ షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్ మెంట్ డిజైన్ (లీడ్) రేటింగ్ ల ఆధారంగా 7 శాతం నుంచి 12 శాతం చెల్లించాల్సి ఉంది.

హరిత భవనాలకు దీనిని పూర్తిగా మినహాయించాలని గుజరాత్ సర్కారు నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో గ్రీన్ బిల్డింగ్స్ కు అనుగుణంగా లేని భవనాలపై జరిమానాలు విధించనుంది. అలాగే భవన వినియోగానికి అనుమతి తీసుకునే సమయంలో రేటింగ్ సర్టిఫికెట్ లేకున్నా జరిమానా విధిస్తుంది. అలాంటి సందర్భాల్లో ఎఫ్ఎస్ఐ ప్రోత్సాహానికంటే రెండితలు చెల్లించాల్సి వస్తుంది. ఈమేరకు గుజరాత్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

నోటిఫికేషన్ తేదీ నాటికి నిర్మాణంలో ఉన్న భవనాలతోపాటు ఇప్పటికే అధీకృత రేటింగ్ సంస్థల నుంచి సర్టిఫికెట్ పొందిన ప్రాజెక్టులు ఎఫ్ఎస్ఐ ప్రోత్సాహకం వర్తిస్తుంది. భవన వినియోగ అనుమతి తీసుకునే సమయంలో ఈ మొత్తాన్ని రీయింబర్స్ చేస్తారు. మరి ఇలాంటి ప్రోత్సాహకాలను తెలంగాణలో ఎప్పుడిస్తారో తెలియడంలేదు. ఇప్పటికే పలు రాష్ట్రాలు హరిత భవనాలకు వివిధ రకాల ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఇలాంటివి ఇంటెన్సివ్ లు ఇస్తే బాగుంటుందని, తద్వారా హరిత భవనాల నిర్మాణాలు పెరుగుతాయని రియల్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

This website uses cookies.