Categories: TOP STORIES

ఆ పెంట్ హౌస్ ఖరీదు.. రూ.190 కోట్లు

దేశంలోనే అత్యంత ఖరీదైన అపార్ట్ మెంట్ డీల్ ఒకటి తాజాగా జరిగింది. గురుగ్రామ్ లోని డీఎల్ఎఫ్ కామెలియాస్ లో 16,290 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన అల్ట్రా లగ్జరీ పెంట్ హౌస్ కు రూ.190 కోట్ల ధర పలికింది. ఇన్ఫో ఎక్స్ సాఫ్ట్ వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రిషి పార్టి ఈ పెంట్ హౌస్ కు కళ్లు చెదిరే మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నారు. డిసెంబర్ 2న రిజిస్టర్ అయిన ఈ లావాదేవీ కోసం రూ.13.30 కోట్ల స్టాంపు డ్యూటీ చెల్లించారు. కాగా, దేశంలో రియల్ ఎస్టేట్ పరంగా ఢిల్లీ, ముంబైలు అత్యంత ఖరీదైన నగరాలుగా మారాయి.

అలాగే ధరలు, లగ్జరీ ఆఫర్లపరంగా గురుగ్రామ్.. ఢిల్లీ, ముంబైలను అధిగమించింది. గతేడాది అక్టోబర్ లో గుర్గావ్ గోల్ఫ్ కోర్స్ రోడ్డులోని డీఎల్ఎఫ్ ది కామెలియాస్ లో 11వేల చదరపు అడుగుల అపార్ట్ మెంట్ రీసేల్ కు రూ.114 కోట్లు వచ్చాయి. అంటే చదరపు అడుగు ధర రూ.1.03 లక్షలు పలికినట్టయింది. దీనిని అప్పట్లో అత్యంత ఖరీదైన లావాదేవీగా పేర్కొన్నారు. 2014లో ఇదే ప్రాజెక్టులోని బేర్ షెల్ యూనిట్ ను చదరపు అడుగుకు రూ.22,500 చొప్పున విక్రయించగా.. తాజాగా ఆ ధర ఎన్నో రెట్లు పెరిగింది. దేశంలో లగ్జరీ హౌసింగ్ అంటే ఢిల్లీ, ముంబై మాత్రమే అనే విషయం తాజా లావాదేవీతో మరోసారి రుజువైందని సీఆర్ఈ మ్యాట్రిక్స్ సీఈఓ అభిషేక్ కిరణ్ గుప్తా వ్యాఖ్యానించారు. గత మూడు నాలుగేళ్లలో దేశంలో లగ్జరీ హౌసింగ్ లావాదేవీలు బాగా పెరిగాయన్నారు. సంపన్న భారతీయుల పెట్టుబడి ఎంపిక రంగాల్లో రియల్ ఎస్టేట్ అగ్రగామిగా కొనసాగుతోందని తెలిపారు.

This website uses cookies.