Categories: TOP STORIES

హెచ్ఎండీఏ వేలానికి హైకోర్టు బ్రేక్

  • ప్రజాప్రయోగ స్థలాల్ని వేలం వేయకూడదు
  • పది శాతానికి మించిన స్థలముంటేనే వేలం
  • మయూరినగర్ సంఘం పిటిషన్ పై హైకోర్టు తీర్పు

ప్రభుత్వ అనుమతి లేకుండా గతంలో ఆమోదించిన లేఅవుటును మార్చే అధికారం హెచ్ఎండీఏకు లేదని హై కోర్టు ఇటీవల స్పష్టం చేసింది. గతంలో ప్రభుత్వం ఆమోదించిన లేఅవుటులో మార్పులు చేయాలంటే మళ్లీ ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలియజేసింది. మియాపూర్లోని మయూరి నగర్ హెచ్ఎండీఏ లేఅవుట్లో 40 ప్లాట్లను వేలం వేయడానికి రంగం సిద్ధమైంది. ఈ నిర్ణయం పట్ల స్థానిక సంక్షేమ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై విచారించిన జస్టిస్ పి. మాధవి దేవి ఇటీవల తీర్పు వెలువరించారు.

మియాపూర్లోని మిగులు భూములైన 380.47 ఎకరాలను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం హుడాకు కేటాయించింది. ఇందులో నివాస గృహాలకు లేఅవుట్ వేసి విక్రయించగా.. కొంత స్థలాన్ని ప్రజాప్రయోగ అవసరాలకు వదిలివేసింది. అలా కేటాయించిన నలభై ప్లాట్లలో పార్కులు, ఆస్పత్రులు, పాఠశాల వంటి సౌకర్యాల్ని అభివృద్ధి చేయాలి. అలా కాకుండా, వాటిని వేలం వేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించ‌డం ప‌ట్ల మయూరి నగర్ సంక్షేమం సంఘం అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది.

హై కోర్టులో కేసు దాఖలు చేసింది. దీనిపై ఇరుప‌క్షాల వాదన‌ల్ని విన్న హై కోర్టు.. మయూరినగర్లో బహిరంగ స్థలాల్ని గుర్తించడానికి కమిటీ వేయాలని, పది శాతం స్థలాన్ని ప్రజాప్రయోగ అవసరాలకు వదిలిపెట్టాలని స్పష్టం చేసింది. అంతకు మించిన స్థలముంటే వేలాన్ని కొనసాగించవచ్చని, లేని పక్షంలో వేలాన్ని రద్దు చేయాలని ఆదేశిస్తూ తీర్పును వెలువరించింది.

This website uses cookies.