బై బ్యాక్ స్కీమ్.. అడ్వాన్స్ స్కీమ్.. అంటూ రకరకాల ఆకర్షణీయ పథకాల్ని ఆరంభించి.. కొనుగోలుదారుల నుంచి సుమారు వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసి.. వారికి సకాలంలో ఫ్లాట్లను అందించక.. ముప్పుతిప్పులు పెడుతున్న మంత్రి డెవలపర్స్ ఎండీ సుశీల్ మంత్రిని గతవారం బెంగళూరులో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. మరి, 2019 నుంచ మన వద్ద యూడీఎస్, ప్రీలాంచులు, బైబ్యాక్ అంటూ.. బయ్యర్లు, పెట్టుబడిదారుల నుంచి ఎంతమంది బిల్డర్లు కోట్ల రూపాయల్ని వసూలు చేశారు? అందులో ఎంతమంది ఫ్లాట్లను సకాలంలో అందించక చేతులెత్తేస్తారు? బెంగళూరు ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఇప్పటికైనా మోసపూరిత డెవలపర్లపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కఠిన చర్యల్ని తీసుకోవట్లేదు? అమాయక కొనుగోలుదారులు మోసగాళ్ల చేతిలో చిక్కకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన నిర్ణయాల్ని ఎందుకు తీసుకోవట్లేదు?
బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ గ్రూప్ మంత్రి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు సీఎండీ సుశీల్ మంత్రిని అరెస్టు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. మనీలాండరింగ్ విచారణలో అనేక మంది గృహ కొనుగోలుదారులను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మంత్రిని బెంగళూరులోని ప్రత్యేక ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పిఎంఎల్‌ఎ) కోర్టులో హాజరుపరిచారు, ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 10 రోజుల కస్టడీకి పంపినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
2020లో బెంగళూరు పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ను అధ్యయనం చేసిన తర్వాత గ్రూప్ మరియు దాని ప్రమోటర్లపై మార్చిలో మనీలాండరింగ్ కేసు నమోదు చేసినట్లు ఏజెన్సీ తెలిపింది. “చాలా మంది గృహ కొనుగోలుదారులు ఈ సంస్థపై పోలీసులకు మరియు ఈడీకి ఫిర్యాదులు చేశారు. మంత్రి డెవలపర్స్ కొనుగోలుదారులను తప్పుదోవ పట్టించే బ్రోచర్‌లను చూపెట్టింది. డెలివరి టైమ్ లైన్లను తప్పుగా చూపెట్టి వందలాది కొనుగోలుదారుల నుంచి అడ్వాన్సుల రూపంలో సుమారు రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసింది. కాకపోతే ఏడు నుంచి పదేళ్లయినా ఆయా ఫ్లాట్లను బయ్యర్లకు అందించలేదు. అనేక రకాల ఆకర్షణీయ పథకాల్ని ప్రవేశపెట్టింది. బైబ్యాక్ ప్లాన్లను ప్రకటించింది. ఫ్లాట్లు, ఇళ్లను కట్టిస్తామంటూ.. అడ్వాన్సుల రూపంలో కోట్ల రూపాయల్ని కొనుగోలుదారుల నుంచి సేకరించింది. కొన్ని సందర్భాల్లో రెరా స్పష్టమైన ఆదేశాల తర్వాత కూడా బయ్యర్లకు సొమ్మును వెనక్కి ఇవ్వలేదని ఈడీ వెల్లడించింది.
ప్రాజెక్టుల్ని నిర్మిస్తామంటూ బయ్యర్ల నుంచి సేకరించిన మొత్తాన్ని వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించింది. అందుకే, మంత్రి సంస్థ ప్రాజెక్టులు నిలిచిపోయాయని విచారణలో ఈడీ కనుగొంది. మంత్రి డెవలపర్స్ వివిధ ఆర్థిక సంస్థల నుంచి దాదాపు రూ.5000 కోట్లను రుణంగా తీసుకుంది. వీటిలో వెయ్యి కోట్లు దాకా చెల్లింపులు చేయాల్సి ఉంది. ఒకే ఆస్తిపై బహుళ రుణాల్ని తీసుకున్నది. ఈ మొత్తం వ్యవహారంపై మంత్రి డెవలపర్స్ ఇంకా ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.
రాష్ట్రంలో రెరా అమల్లోకి వచ్చిన తర్వాత.. యూడీఎస్, ప్రీలాంచులు, బైబ్యాక్ ప్లాన్ అంటూ.. కొంతమంది డెవలపర్లు, రియల్టర్లు.. అమాయకుల నుంచి కోట్ల రూపాయల్ని వసూలు చేశారు. ఈ జాబితాలో బడా కార్పొరేట్ సంస్థలూ ఉండటం గమనార్హం. బెంగళూరులో క్రియాశీలకంగా వ్యవహరించే కొన్ని సంస్థలు ఇటీవల హైదరాబాద్‌లో పలు ప్రాజెక్టుల్ని ప్రారంభించి.. ప్రీలాంచుల పేరిట కోట్ల రూపాయల్ని దండుకున్నాయి. ఓ సుమధురమైన సంస్థ శంషాబాద్‌లో ఇటీవల హండ్రెడ్ పర్సంట్ స్కీములో బయ్యర్ల నుంచి సొమ్ము వసూలు చేసింది. ఇక కొందరు రియల్టర్లు ఫామ్ ప్లాట్లను ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముతున్నారు. మరికొందరు కొండలు, గుట్టలను చూపెడుతూ.. తక్కువ రేటంటూ.. ముందే డబ్బు వసూలు చేస్తున్నారు. అనధికారిక లెక్కల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో.. గత మూడేళ్ల నుంచి.. యూడీఎస్, ప్రీలాంచులు, బైబ్యాకుల పేరిట.. కొందరు డెవలపర్లు, రియల్టర్లంతా కలిసి సుమారు రూ.లక్ష కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరు నిపణులు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వీరంతా ఇష్టారాజ్యంగా చెలరేగిపోయి వ్యవహరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తకుండా వ్యవహరిస్తోంది. ఇప్పటికైనా ప్రజలు రోడ్డు మీద పడక ముందే.. ఈ సమస్యకు పరిష్కారం చూపెట్టాలి.
This website uses cookies.