డెక్కన్ సిమెంట్స్ కి చెందిన మైనింగ్ కార్యకలాపాలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. సూర్యాపేట జిల్లాలోని మైనింగ్ గనుల్లో తదుపరి విచారణ వరకు ఎలాంటి కార్యకలాపాలూ చేపట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సామాజిక కార్యకర్త కోటేశ్వరరావు వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ‘మైనింగ్ లీజ్ నెంబర్ 3లో తదుపరి విచారణ తేదీ వరకు డెక్కన్ సిమెంట్స్ ఎలాంటి కార్యకలాపాలూ చేపట్టకూడదు.
అయితే, దీనికి సంబంధించి ఈ కోర్టులో ఏమైనా దరఖాస్తు చేసుకోవడానికి డెక్కన్ సిమెంట్స్ కి అనుమతిస్తున్నాం’ అని అందులో పేర్కొంటూ తదుపరి విచారణను ఏప్రిల్ 22కి వాయిదా వేసింది. కాగా, డెక్కన్ సిమెంట్స్ పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ కార్యకలాపాలు చేస్తోందంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ ప్రకటించింది. అంతేకాకుండా 8.8 హెక్టార్ల అటవీ భూమిని ఆక్రమించుకుని మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడుతోందని పేర్కొంది.