కార్యాలయ స్థలాలకు జూన్ త్రైమాసికంలో 48 శాతం అధిక డిమాండ్
3.4 మిలియన్ చదరపు అడుగుల స్థలాల లీజింగ్
వెస్టియన్ నివేదిక వెల్లడి
ఆఫీస్ స్పేస్ లీజింగ్ లో హైదరాబాద్ అదరగొట్టింది. భాగ్యనగరంలో కార్యాలయ స్థలాలకు డిమాండ్ బాగా ఉందని వర్క్ ప్లేస్ సొల్యూషన్స్ సంస్థ వెస్టియన్ వెల్లడించింది. గతేడాది జూన్ త్రైమాసికంతో పోలిస్తే.. ఈ ఏడాది జూన్ క్వార్టర్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 48 శాతం వృద్ధితో 3.4 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైనట్టు తెలిపింది. గతేడాది ఈ క్వార్టర్లో ఇది 2.3 మిలియన్ చదరపు అడుగులుగా ఉన్నట్టు వివరించింది. అలాగే దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో జూన్ త్రైమాసికంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 23 శాతం పెరిగి 17.04 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైనట్టు తెలిపింది. నగరాలవారీగా చూస్తే.. బెంగళూరులో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 15 శాతం వృద్ధితో 4.25 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో ఇది 3.70 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఇక్కడ ఐటీ – ఐటీఈఎస్, ఏఐ అండ్ రోబోటిక్స్ కంపెనీలే మొత్తం లీజింగ్‌లో 69 శాతం మేర వాటా కలిగి ఉండటం గమనార్హం.
ముంబై విషయానికి వస్తే.. 88 శాతం పెరుగుదలతో 3.39 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ నమోదైంది. పుణెలో 60 శాతం వృద్ధితో 2.88 మిలియన్ చదరపు అడుగులు నమోదు కాగా.. చెన్నైలో 20 శాతం తగ్గి 1.75 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. ఢిల్లీ ఎన్‌సీఆర్ మార్కెట్లో 43 శాతం తగ్గుదలతో 1.4 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ నమోదైంది. కోల్‌కతా మార్కెట్లో రెట్టింపు పరిమాణంలో 0.23 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ నమోదైంది. అంతర్జాతీయంగా భౌగోళక ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ, భారత్ ఆఫీస్ స్పేస్ మార్కెట్ రెండో త్రైమాసికంలో మంచి పురోగతి కనబరిచిందని వెస్టియన్ సీఈఓ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఐటీ-ఐటీఈఎస్, బీఎఫ్‌ఎస్‌ఐ రంగాల నుంచి బలమైన డిమాండ్ నేపథ్యంలో లీజింగ్ మార్కెట్ ఇకపై కూడా ఇదే విధంగా దూసుకెళ్తుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. కాగా, ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలోనూ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 18 శాతం వృద్ధితో 30 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైందని వెస్టియన్ నివేదిక వెల్లడించింది.