నగరాల్లో ఇప్పుడు ఎక్కడ చూసిన అత్యంత ఎత్తైన భవనాలే దర్శనమిస్తున్నాయి. ఆకాశహర్మ్యాలే తమ అభివృద్ధికి నిదర్శనమనే రీతిలో ఎన్ని అంతుస్తులకైనా అనుమతులు వచ్చేస్తున్నాయి. అయితే, ఇలాంటి హైరైజ్ బిల్డింగ్స్ వల్ల వాతావరణంలోకి 15 శాతం అధికంగా కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా వంటి అతి ఎత్తైన భవనానికి నిర్మాణపరంగా సొబగులు అద్దేందుకు ఏకంగా 4 వేల టన్నుల స్టీల్ వినియోగించారు. ఇలాంటి స్టక్చరల్ స్టీల్ ఉత్పత్తి చేసిన క్రమంలో వాతావరణంలోకి 15 శాతం ఎక్కువగా కర్బన ఉద్గారాలు వెలువడ్డాయి. వెరసి హైరైజ్ భవనాల వల్ల వాతావరణానికి నష్టం కలుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ఆకాశహర్మ్యాలు నిర్మించడం సబబేనా అనే సందేహాలు వస్తున్నాయి.
నిజానికి భవనం ఎత్తు అనేది ఆర్కిటెక్చర్ ఒక్కటే కాదు.. ఇదో పెద్ద బిజినెస్. ఎంత ఎత్తైన భవనం అయితే అంత గుర్తింపు వస్తుంది. దీంతో అందరూ హైరైజ్ భవనాల వైపే దృష్టి సారిస్తున్నారు. హైదరాబాద్ లో కూడా 40 నుంచి 50కి పైగా అంతస్తులతో కూడిన భవనాలు నిర్మాణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణంలోకి అధిక కర్బన ఉద్గారాలు విడుదల కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.