సాధారణంగా హెచ్ఎండీఏ వేలం అనగానే.. దేశ, విదేశీ బయ్యర్లు అమితాసక్తి చూపిస్తారు. న్యాయపరంగా ఎలాంటి చిక్కులుండవనే ఏకైక కారణంతో వీటిని కొనేందుకు ముందుకొస్తారు. అందుకే, మార్కెట్ రేటు కంటే కాస్త ఎక్కువ ధర అయినా పెట్టడానికి వెనకడుగు వేయరు. అయితే, ఈసారి ఎందుకో కానీ సీన్ రివర్స్ అయ్యింది. హెచ్ఎండీఏ వేలానికి అనుకున్నంత స్పందన రాలేదు. ఆశించినంత స్థాయిలో ప్లాట్లు అమ్ముడు పోలేదు. కొందరు ప్రసార మాధ్యమాల్లో వేలానికి ఆదరణ ఎక్కువని చెబుతున్నప్పటికీ.. అది వాస్తవం కాదని చెప్పొచ్చు. ఎందుకంటే?
మూడు జిల్లాల్లో.. హాట్ లొకేషన్లలో.. హెచ్ఎండీఏ 38 ప్లాట్లను వేలం వేసింది. అందులో కేవలం 9 ప్లాట్లే అమ్ముడయ్యాయి. అంటే, ఇంచుమించు పాతిక శాతం మాత్రమే ప్లాట్లు అమ్ముడయ్యాయని అర్థం. అంటే, మిగతవాటిని కొనేందుకు కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపెట్టలేదు. ఒక ప్లాటు అత్యధిక ధర.. గజం రూ.1.10 లక్షలకు అమ్ముడయ్యిందని హెచ్ఎండీఏ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అయితే, అది ఏ ప్రాంతంలోని ప్లాటు? ఎవరు కొన్నారు? ఆ ప్లాటు వాస్తవ ధర ఎంత? ఎంత ఎక్కువకు అమ్ముడైందనే విషయాల గురించి ప్రకటనలో ఎక్కడా పేర్కొనలేదు. గతంలో కోకాపేట్ నియోపోలిస్ వేలంలో ప్లాట్లు అమ్ముడైనప్పుడు.. ఏయే సంస్థ ఎన్ని ఎకరాలను.. ఎంతెంత రేటు పెట్టి కొనుగోలు చేశారో స్పష్టంగా పేర్కొన్న విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడా వివరాలు ఎక్కడా చెప్పలేదు.
This website uses cookies.