డీటీసీపీ అనుమతి లేదు.. రెరా పర్మిషన్ తీసుకోరు.. అయినా నిస్సిగ్గుగా.. నిర్లజ్జగా.. బ్రోచర్లను చూపెట్టి.. మిరపకాయ బజ్జీల్లా ప్లాట్లను అమ్మేస్తున్నారు. ఆ స్థలంలో వేసిన లేఅవుట్‌కి అనుమతి వస్తుందన్న నమ్మకం లేదు.. ఒకవేళ రాకపోయినా, ఎవరేం చేస్తారులే అనే ధీమాతో.. అమాయక కొనుగోలుదారులకు గాలం వేస్తూ.. వారి కష్టార్జితాన్ని దోచుకుంటున్న కేటుగాళ్ల సంఖ్య హైదరాబాద్లో పెరుగుతోంది. ప్రీలాంచుల్లో ఎంత మంది నుంచి సొమ్ము కొల్లగొట్టినా.. ఇక్కడి రెరా అథారిటీ పట్టించుకోదనే ధీమాతో.. పొరుగు రాష్ట్రాల నుంచి మరీ నగరానికి విచ్చేసి.. అక్రమ దందాకు తెరలేపుతున్నారు. ముంబై హైవేలోని సదాశివపేటలో రేటు తక్కువంటూ.. ప్రీలాంచ్‌లో ప్లాట్లను విక్రయిస్తోంది.. మియాపూర్ కేంద్రంగా పని చేస్తున్న యోషితా ఇన్‌ఫ్రా. తెలంగాణ రెరా నోటీసుల్ని సైతం బేఖాతరు చేసి యధేచ్చగా ప్లాట్లను అమ్ముతున్న ఇలాంటి సంస్థలను ఇప్పటికైనా దారిలోకి తేవాల్సిన బాధ్యత రెరా అథారిటీపై ఉంది.
యోషితా హౌసింగ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ సదాశివపేట్‌లో గతేడాది స్టెల్లార్ ఎస్టేట్ వెంచర్‌ను ఆరంభించింది. సుమారు అరవై ఐదు ఎకరాల్లో అభివృద్ధి చేసిన ఈ వెంచర్లో 850 ప్లాట్లు ఉన్నాయి. ఇందులో 160 గజాల ప్లాటు ధర.. గజానికి.. రూ. 11,500. ఈ రేటు చొప్పున సుమారు 90 శాతం ప్లాట్లను విక్రయించింది. డీటీసీపీ నుంచి అనుమతి రాగానే ప్లాట్లను రిజిస్టర్ చేస్తామని సంస్థ చెబుతూ వస్తోంది. కాలం గడిచే కొద్దీ.. ఈ వెంచర్‌కు అనుమతులు రావట్లేదు.. ప్లాట్లను రిజిస్టర్ చేయట్లేదు. కారణం.. ఈ లేవుట్ అభివృద్ధి చేసిన కొన్ని సర్వే నెంబర్లు నిషేధిత జాబితాలో ఉండటమే అసలైన కారణమని తెలుస్తోంది. ఈ అంశం గురించి కొందరు బయ్యర్లు కాళ్లరిగేలా మియాపూర్‌లోని యోషితా ఇన్‌ఫ్రా హౌసింగ్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. అయినా ప్లాట్లను సంస్థ రిజిస్టర్ చేయట్లేదు.
* యోషితా ఇన్‌ఫ్రా ఈ ఒక్క వెంచర్‌తో ఆగిపోతే ఫర్వాలేదు.. ఈ వెంచర్ పక్కనే గల మరో యాభై ఎకరాలపై కన్నేసింది. స్థానిక సంస్థల నుంచి అనుమతి రాక ముందే.. రెరా లేకుండానే.. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ.. రేటు తక్కువ అంటూ ప్లాట్లను విక్రయిస్తోంది. డీటీసీపీ అనుమతి తీసుకోకుండా.. ప్లాట్లను ఎలా అమ్ముతారని సంస్థ యజమానిని సంప్రదిస్తే.. ఆయన పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. త్వరలో అనుమతులొస్తాయని అంటున్నారే తప్ప.. ఇంతవరకూ ఎందుకు రాలేదంటే.. సరైన జవాబు చెప్పట్లేదు. ఆయా సర్వే నెంబర్లు నిషేధిత జాబితాలో ఉండటమే కారణమని తెలుస్తోంది. రెరా అనుమతి లేకుండా ప్రకటనల్ని జారీ చేయడం, ప్లాట్లను అమ్మడం చట్ట విరుద్ధమని.. ఈ వెంచర్‌కు అనుమతులు రాలేదని స్థానిక అధికారులు చెప్పారు.
డీటీసీపీ నుంచి అనుమతి తీసుకోకుండా.. ప్లాట్లను విక్రయించిన యోషితా ఇన్‌ఫ్రా సంస్థ నుంచి ప్రాజెక్టు విలువలో పది శాతం జరిమానాను విధించాలి. అంతేతప్ప, డీటీసీపీ అనుమతి తెచ్చుకోగానే.. ఎవరికీ తెలియకుండా రెరా అనుమతిని మంజూరు చేయకూడదు. అలా చేస్తే.. భవిష్యత్తులోనూ మోసపూరిత రియల్టర్లు ఇదే విధంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. దీంతో, ప్రీలాంచులకు అడ్డు కట్ట వేయలేని దుస్థితి నెలకొంటుంది.
రెరా లేకుండా ప్లాట్లను విక్రయించడం నిషిద్ధమని నిబంధనలు చెబుతున్నా.. యోషితా ఇన్‌ఫ్రా మాత్రం ఎంచక్కా.. ప్రతిపాదిత డీటీసీసీ, రెరా వెంచర్ అని బ్రోచర్లను ముద్రించి.. ప్లాట్లను విక్రయిస్తోంది. అసలు ఇంతకంటే దారుణం మరెక్కడైనా ఉంటుందా? ఇలాంటి మోసపూరిత రియల్టర్లపై.. రెరా నిబంధనల ప్రకారం చర్యలను తీసుకోకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు?
This website uses cookies.