హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (HMDA) భారీ ఎత్తున ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైంది. ఇందులో భాగంగా పెద్ద అంబర్‌పేట్, ఘట్‌కేసర్, బాలాపూర్ మండలాల పరిధిలో భూ సమీకరణ పథకం కింద 515 ఎకరాల్లో భారీ లేఅవుట్లను డెవలప్ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. కొర్రెముల, తిమ్మాయిగూడ, కుత్బుల్లాపూర్, కుర్మల్ గూడ, నాదర్‌గుల్ ప్రాంతాల్లో లేఅవుట్లు అభివృద్ది చేయనున్న భూములపై అభ్యంతరాలను స్వీకరిస్తోంది.
హెచ్‌ఎండీఏ అనుమతులతో ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థలు చేసే లేఅవుట్ లలోని ఇంటి స్థలాలకు భారీ డిమాండ్ ఉంటోంది. ఇక హెచ్‌ఎండీఏనే స్వయంగా విక్రయించే భూములు, స్థలాలు హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంటాయి. శివార్లలో రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా దూసుకుపోతుండటంతో చాలా మంది రైతులు, భూ యజమానులు తమ స్థలాలను అభివృద్ధి చేయడానికి రియల్ ఎస్టేట్ సంస్థలను ఆశ్రయించటం, ఈ క్రమంలో పలువురు మోసపోయిన దాఖలాలున్నాయి. ఇటువంటి మోసాలకు తావు లేకుండా హెచ్‌ఎండీఏ లేఅవుట్లను అభివృద్ధి చేయడానికి ఉమ్మడి రాష్ట్రంలో భూసమీకరణ పథకాన్ని చేపట్టారు. ఉప్పల్ భగాయత్ లేఅవుట్‌కు భూసమీకరణ పథకం కిందనే రైతుల నుంచి భూములను సేకరించారు. ఇదే విధానాన్ని కొనసాగించేందుకు గత ప్రభుత్వ హయాంలో భూసమీకరణ పథకం-2017 పేరుతో మార్గదర్శకాలను రూపొందించారు. ఈ పథకం కింద ఇన్ముల్‌నర్వా, లేమూరు ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ లేఅవుట్లను అభివృద్ధి చేసింది.
నోటిఫికేషన్లలో ప్రకటించిన ఆయా భూములపై అభ్యంతరాల స్వీకరణ పూర్తవగానే రైతులతో హెచ్‌ఎండీఏ ఒప్పందం చేసుకుంటుంది. ఈ భూములను అభివృద్ధి చేసిన తర్వాత లేఅవుట్లలో రైతులకు 60 శాతం వాటా ఇవ్వనుండగా హెచ్‌ఎండీఏ 40 శాతం వాటాను తీసుకుంటుంది. ఈ మేరకు ఆరు నెలల వ్యవధిలో ఒప్పంద ప్రక్రియను, డ్రాఫ్ట్ లేఅవుట్లను రూపొందించడానికి హెచ్‌ఎండీఏ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆ తర్వాతే హెచ్‌ఎండీఏ డెవలెప్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో లేఅవుట్లను 30 అడుగులు, 40 అడుగులు, 60 అడుగుల రోడ్లు, అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ, నీటి సరఫరా వ్యవస్థ, పార్కులతో అభివృద్ధి చేయనున్నారు. ఈ లేఅవుట్లకు 100 అడుగుల అప్రోచ్ రోడ్డు ఉండేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఈ భారీ లేఅవుట్ల అభివృద్ధికి మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు.