సరైన ప్రాడక్ట్, లొకేషన్, ప్రైస్, బిల్డర్.. ఈ నాలుగుంటే ఫ్లాట్ల అమ్మకాలకు ఢోకా ఉండదని తాజాగా నిరూపితమైంది. హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు తగ్గిపోయాయనే మాట నుంచి ఇప్పుడిప్పుడే మార్కెట్ కోలుకుంటుందని చెప్పడానికి నిదర్శనమిది.
కాసా గ్రాండ్ అనే సంస్థ కొంపల్లిలో కాసా గ్రాండ్ ఎవాన్ ప్రాజెక్టును ఇటీవల లాంచ్ చేసింది. దీనికి నేచురల్ స్టార్ నానీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. 6.8 ఎకరాల ఈ గేటెడ్ కమ్యూనిటీలో 4.7 ఎకరాల్లో ఓపెన్ స్పేస్ మరియు జపనీస్ తరహా ల్యాండ్‌స్కేప్‌తో తీర్చిదిద్దుతున్నారు. అల్ట్రా స్పేషీయస్ గృహాల్ని కట్టడమే కాకుండా 12 ఫీట్ల బెడ్‌రూముల్ని డిజైన్ చేశారు. మరి, ఈ ప్రాజెక్టు ప్రత్యేకతల్ని బయ్యర్లకు విడమరిచి చెప్పడంలో ఈ సంస్థ విజయవంతమైంది. అందుకే, కాసాగ్రాండ్ ఎవాన్ ప్రాజెక్టును ప్రకటించిని మొదటివారంలోనే సుమారు 105 ఫ్లాట్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుత పరిస్థితిలో ఇది సరికొత్త రికార్డు అని చెప్పొచ్చు.
కొత్త ప్రాజెక్టులే కాదు.. ఇదివరకే ఆరంభమైన కొన్ని ప్రాజెక్టుల్లోనూ అమ్మకాలు మెరుగ్గా జరుగుతున్నాయి. ఉదాహరణకు కోకాపేట్ తర్వాత వచ్చే కొల్లూరులో జీహెచ్ఆర్ ఇన్‌ఫ్రా సంస్థ జీహెచ్ఆర్ కలిస్టో అనే అఫర్డబుల్ లగ్జరీ ప్రాజెక్టును నిర్మిస్తోంది. అన్నీ సంస్థల్లాగే జీహెచ్ఆర్ కూడా కడుతోంది.. ఇందులో ప్రత్యేకత ఏముందనే సందేహం అందరికీ రావొచ్చు. ఈ సంస్థ మార్చి నెలలో సుమారు 22 ఫ్లాట్లను విక్రయించి తన ప్రత్యేకతను చాటుకుంది. నిజానికి, కొల్లూరు వంటి ప్రాంతంలో.. అధిక శాతం బిల్డర్లకు నెలకు ఐదారు ఫ్లాట్లే అమ్ముతుంటారు.. కానీ, జీహెచ్ఆర్ కలిస్టోలో మాత్రం గత నెలలో 22 ఫ్లాట్లు అమ్ముడయ్యాయి. అంటే, అధిక శాతం మంది కొనుగోలుదారులు ప్రచారానికి ఆకర్షితులు కాకుండా.. స్వయంగా ప్రాజెక్టు వద్దకెళ్లి.. సంస్థ చెప్పే మాటల్ని గమనించి.. స్పెసిఫికేషన్స్ పక్కాగా చూసి.. నిజంగా బిల్డింగ్ ను కడతారా? లేదా? అనే అంశాన్ని పక్కాగా బేరీజు వేశాకే.. తుది నిర్ణయానికి వస్తున్నారు.
రెడీ టు ఆక్యుపై పరిస్థితి?
నాలుగైదేళ్ల క్రితం ఆరంభమైన ప్రాజెక్టుల్లో అధిక శాతం రెడీ టు ఆక్యుపై స్థాయికి వచ్చేశాయి. అయితే, అధిక శాతం మంది బిల్డర్లు చేశారంటే.. నిర్మాణం మరో ఆరు నెలల్లో పూర్తవుతుందనగా రేటును పెంచేస్తున్నారు. ఆరు నెలలు దాటాక అంటే నిర్మాణం పూర్తయ్యి ఓసీ వచ్చాక మరోసారి ధరను అధికం చేస్తున్నారు. ఇలా ఏడాది కాలంలోనే చదరపు అడుక్కీ సుమారు వెయ్యి రూపాయలు దాకా పెంచేస్తుండటంతో.. కొనుగోలుదారులు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు.
* కేవలం ఏడాది వ్యవధిలోనే రెండు వేల చదరపు అడుగుల ఫ్లాట్ మీద ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు పెంచేయడంతో.. ఇతర ప్రత్యామ్నయాలపై దృష్టి సారిస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే కొందరు ప్రీలాంచుల వైపు మొగ్గు చూపుతున్నారు. మరికొందరు.. ఒకట్రెండేళ్లు ఆలస్యమైనా ఫర్వాలేదనుకుని భావించి.. రేటు తక్కువన్న ఫ్లాట్లను కొంటున్నారు. మరికొన్ని సందర్భాల్లో నచ్చిన ఫ్లాట్లు లేకపోవడంతో రెడీ టు ఆక్యుపైలో కొందరు కొనడం లేదు.