- పండగవేళ.. పారాహుషార్
- రేటు తక్కువంటే ఎగబడొద్దు
- ఫ్లాట్ కట్టగలడా.. లేదా..
అదేంటో కానీ.. కొంతమంది హోమ్ బయ్యర్ల వ్యవహారశైలి భలే విచిత్రంగా కనిపిస్తోంది. ఇళ్లను ఎందుకు కొంటున్నారో.. ఎంతకు తీసుకుంటున్నారో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. కోటీ రూపాయల ఫ్లాట్ యాభై లక్షలంటే చాలు.. సొమ్ము తెచ్చి బిల్డర్ల ముందు పోస్తున్నారు. రెండు కోట్ల విల్లా యాభై లక్షలంటే చాలు.. ఎలాగోలా సొమ్ము కట్టేస్తున్నారు. పైగా, రశీదు కూడా సరిగ్గా తీసుకోవట్లేదు. నాలుగైదేళ్లయ్యాకే ఫ్లాట్ ఇవ్వండి.. విల్లా ఇవ్వండంటూ బిల్డర్లకే గడవునిచ్చే వ్యక్తులున్నారంటే నమ్మండి. అందుకే, అధిక శాతం మంది ప్రీలాంచుల్లో కొనుగోలు చేసి మోసపోతున్నారు.
ఇలాంటి హోమ్ బయ్యర్లు మార్కెట్లో ఉండటం వల్లే.. ఇతర రంగాలకు చెందిన వ్యక్తులు సైతం నిర్మాణ రంగంలోకి విచ్చేస్తున్నారు. ఎక్కడో ఒక చోట స్థలాన్ని తీసుకుని.. ప్రీలాంచుల్ని ఆరంభిస్తున్నారు. ముఖ్యంగా, కరోనా సమయంలో ఇలాంటి బిల్డర్లు మార్కెట్లోకి అడుగుపెట్టి కొనుగోలుదారుల్ని దారుణంగా మోసగించారు. భువనతేజ ఇన్‌ఫ్రా ఇందుకొక చక్కటి ఉదాహరణ. ఈ సంస్థ గతంలో ఒక్క అపార్టుమెంట్‌ని కట్టలేదు. వెంచర్‌ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసింది లేదు.
అయినపన్పటికీ, 13 లక్షలకే ఫ్లాటు… 16 లక్షలకే ఫ్లాట్ అంటే ప్రజలు ఎగబడి కొన్నారు. కొన్నాళ్ల తర్వాత తాము మోసపోయామని తెలుసుకుని ఏం చేయాలో అర్థం కాక ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి సంస్థలు హైదరాబాద్‌లో ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి, దసరా మరియు దీపావళి వేళలో.. ఎవరైనా పండగ ఆఫర్‌ను ప్రకటిస్తే.. ఒకటికి రెండుసార్లు ఆయా సంస్థ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అసలా కంపెనీ ఎప్పుడు ఆరంభమైంది? ఎక్కడ ఆరంభమైంది? ఎన్ని ప్రాజెక్టుల్ని పూర్తి చేశాడు? సకాలంలో ఫ్లాట్లను బయ్యర్లకు అందించాడా? లేదా? వంటి విషయాల్ని పూర్తిగా తెలుసుకుని అడుగు ముందుకేయాలి.
కొందరు బిల్డర్లు మాయమాటల్ని చెబుతూ.. ప్రజల్ని బుట్టలో వేసుకుంటున్నారు. వీరు సొమ్ము తీసుకునేటప్పుడు ఒక రకంగా.. ఆతర్వాత మరో రకంగా వ్యవహరించడంతో ఏం చేయాలో కొనుగోలుదారులకు అర్థం కావట్లేదు. అసలు రియల్ రంగంలో ఇలా కూడా మోసం చేస్తారా? అని తెలుసుకుని బిత్తరపోతున్నారు. కాబట్టి, ఇలాంటి మాయగాళ్ల వలలో పడకూడదంటే.. ప్రీలాంచుల్ని ఎట్టి పరిస్థితులో నమ్మకండి. తక్కువ రేటుకు ఫ్లాట్లను విక్రయించే వ్యక్తికి అపార్టుమెంట్‌ను కట్టే స్థోమత.. అర్హత.. ఉందా? లేదా? అనే అంశాన్ని పక్కాగా గమనించాలి. ఆతర్వాతే ఎంపికలో తుది నిర్ణయానికి రావాలి.