నిన్నటి వరకూ పశ్చిమ హైదరాబాద్‌లోని కొన్ని రిజిస్ట్రేషన్ కార్యాయాలు కిక్కిరిసిపోయాయి. కానీ, నేడో భూతద్ధం వేసి వెతికినా.. గతంలో ఉన్న సందడి కనిపించట్లేదు. ఒక్కసారిగా రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయి. దీనికి ప్రధాన కారణం.. ట్రిపుల్ వన్ జీవోను రద్దు చేయడమేనని కొందరు మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఔనా.. ఇది నిజమేనా?
రియల్ రంగం.. ఎప్పుడైనా ఎక్కడైనా.. గిరాకీ, సరఫరా మీదే ఆధారపడుతుంది. నిన్నటి వరకూ పశ్చిమ హైదరాబాద్ చేరువలో స్థలాల కొరత విపరీతంగా ఉండేది. న్యాయపరమైన చిక్కుల్లేని భూములు అరుదుగా దొరికేవి. ఈ కారణంగానే.. మాదాపూర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో ఫ్లాట్ల ధర చదరపు అడుక్కీ రూ.10,000కు చేరుకున్నాయి. గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాల్లో అటుఇటుగా ఎనిమిది వేలు చెబుతున్నారు. కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టుల్లోనూ రేట్లు ఎక్కువే ఉన్నాయి. అయితే, ట్రిపుల్ వన్ జీవోను ఇటీవల ప్రభుత్వం ఎత్తివేయడం వల్ల.. ఒక్కసారిగా కొనుగోలుదారుల్లో సరికొత్త ఆలోచనలు రేకెత్తుతున్నాయి. 111 జీవోను ఎత్తివేస్తే 1.32 లక్షల ఎకరాలు అందుబాటులోకి వస్తుంది. అందులో సగంలో సగం స్థలంలో ఇళ్ల నిర్మాణానికి అనుమతినిచ్చినా.. ముప్పయ్ వేలకు పైగా ఎకరాల స్థలం మార్కెట్లోకి వస్తుంది. భూమి సరఫరా పెరిగితే గిరాకీ తగ్గినట్లే కదా! కాబట్టి, ట్రిపుల్ వన్ జీవో చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో రేట్లు తగ్గుతాయనేది కొందరు నిపుణులు అంటున్నారు. ఈ దిశగా ఇప్పటికే కొనుగోలుదారులు ఆలోచించి ఎలాంటి అడుగులు వేస్తున్నారో తెలుసా?
కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో 4 నుంచి 5 వేల కంటే అధిక విస్తీర్ణంలో ఫ్లాట్ల సంఖ్య దాదాపు 3000 దాకా ఉన్నాయని సమాచారం. రేటు తక్కువ అని ఇప్పటికే ఇందులో కొన్నవారు పునరాలోచనలో పడ్డారని తెలిసింది. అయితే, కొత్తవాళ్లు మాత్రం ఆయా అపార్టుమెంట్లలో కొనేందుకు పునరాలోచిస్తున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వీరంతా వేచి చూసే ధోరణీకి అలవాటు పడ్డారని.. ట్రిపుల్ వన్ జీవో మీద స్పష్టత వచ్చేంత వరకూ ఎదురు చూస్తున్నారని నిపుణులు అంటున్నారు.
This website uses cookies.