ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్ 150 శాతం వృద్ధి సాధించిందని నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించింది. 2020 ప్రథమార్థంతో పోల్చితే 2021లో ఈ ఘనత సాధించిందని తెలిపింది. 2020 మొదటి ఆరు నెలల్లో కేవలం 4,782 యూనిట్లు అమ్ముడు కాగా.. ఈ ఏడాదిలో 11,974 ఇళ్లు అమ్ముడయ్యాయని తెలియజేసింది. గత ఏడాది కేవలం 4,422 యూనిట్లు కొత్తగా ఆరంభం కాగా.. ఈ ఏడాది 16,712 కొత్త ఫ్లాట్ల నిర్మాణం ఆరంభమైందని తెలియజేసింది. ఇందులో 278 శాతం వృద్ధి నమోదైందని స్పష్టం చేసింది. మరి, కరోనాతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ దాకా మార్కెట్ స్తంభించగా.. మొదటి మూడు నెలల్లో ఏయే సంస్థలు కొత్త ప్రాజెక్టుల్ని ప్రారంభించాయనే విషయాన్ని ఈ నివేదికలో వెల్లడించలేదు.
<div class=”point”></div> నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం.. రూ.25 నుంచి 50 లక్షల గృహాలకు 240 శాతం గిరాకీ పెరిగింది. రూ.1-2 కోట్ల రేటు గల ఇళ్లకు 158 శాతం అధికమైంది. ప్రధానంగా కూకట్‌పల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట్ వంటి ప్రాంతాల్లోనే కొత్త ప్రాజెక్టుల ఆరంభంతో పాటు అమ్మకాలు అధికంగా జరిగాయి. ఉత్తర హైదరాబాద్‌లో కూడా అమ్మకాలతో పాటు కొత్త ప్రాజెక్టుల శాతం గణనీయంగా పెరిగింది. హైదరాబాద్‌లో తాజాగా 278 శాతం సరఫరా పెరిగింది. గత కొంతకాలం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ పోకడ పెరగడం వల్ల సొంతిళ్లను కొనేవారి సంఖ్య పెరిగిందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. రూ.20-40 లక్షల రేటు గల ఇళ్ల నిర్మాణం గణనీయంగా పెరిగింది. హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు కేవలం ఒక శాతం మాత్రమే పెరిగాయని నైట్‌ఫ్రాంక్ బ్రాంచ్ డైరెక్టర్ శాంసన్ ఆర్థర్ తెలిపారు.