దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు తగ్గిపోయాయి. గతేడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది జనవరి-మార్చి కాలంలో హైదరాబాద్ లో గృహ విక్రయాలు ఏకంగా 47 శాతం మేర పడిపోయాయి. ఈ ఏడాది జనవరి-మార్చి కాలంలో హైదరాబాద్‌లో 11,114 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదవుతాయని రియల్ ఎస్టేట్ డేటా విశ్లేషణ సంస్థ ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది. గతేడాది ఇదే సమయంలో 20,835 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. అలాగే దేశవ్యాప్తంగా 9 ప్రధాన నగరాల్లో మార్చి త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 23 శాతం తక్కువగా 1,05,791 యూనిట్లుగా ఉండొచ్చని ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది.
గతేడాది ఇదే సమయంలో ఈ నగరాల్లో అమ్మకాలు 1,36,702 యూనిట్లుగా ఉన్నాయి. అధిక ధరలతో డిమాండ్ బలహీనపడడం, ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు విక్రయాలు పడిపోవడానికి కారణాలు అని నివేదిక వెల్లడించింది. ఢిల్లీ, బెంగళూరు మినహా మిగిలిన అన్ని నగరాల్లోనూ అమ్మకాలు తగ్గిపోయాయని పేర్కొంది. కొత్త ఇళ్ల సరఫరా సైతం జనవరి-మార్చి మధ్య 34 శాతం క్షీణించి 80,774 యూనిట్లకు పరిమితం కావచ్చని ప్రాప్ ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజ తెలిపారు. గతేడాది మొదటి త్రైమాసికంలో సరఫరా 1,22,365 యూనిట్లుగా ఉందని వివరించారు. కాగా, బెంగళూరులో జనవరి-మార్చి మధ్య విక్రయాలు 18,508 యూనిట్లుగా ఉండొచ్చని నివేదిక తెలిపింది.
గతేడాది తొలి త్రైమాసికంలో జరిగిన 16,768 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే.. ఇక్కడ 10 శాతం పెరుగుతాయని అంచనా వేసింది. అలాగే ఢిల్లీలోనూ 10 శాతం వృద్ధితో 11,221 యూనిట్ల అమ్మకాలు నమోదు కావచ్చని తెలిపింది. చెన్నైలో గతేడాది తొలి మూడు నెలల్లో జరిగిన 4,962 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే.. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో విక్రయాలు 2 శాతం తగ్గి 4,858 యూనిట్లకు పరిమితం కావొచ్చని తెలిపింది. కోల్‌కతాలో 28 శాతం తక్కువగా 4,219 యూనిట్ల విక్రయాలు నమోదు కావొచ్చని పేర్కొంది. ముంబై మార్కెట్లో 10,432 యూనిట్లు అమ్ముడుపోవచ్చని వెల్లడించింది. గతేడాది ఇదే సయంలో ఇక్కడ విక్రయాలు 16,204 యూనిట్లుగా ఉన్నాయి. నవీ ముంబైలో 7 శాతం తక్కువగా 8,551 యూనిట్లకు పరిమితం కావొచ్చని నివేదిక తెలిపింది. పుణెలోనూ అమ్మకాలు 33 శాతం తక్కువగా 17,634 యూనిట్లుగా ఉంటాయని వివరించింది. థానేలో 27 శాతం క్షీణతతో అమ్మకాలు 19,254 యూనిట్లుగా ఉంటాయని పేర్కొంది.
This website uses cookies.