Categories: TOP STORIES

ఇల్లు కొనాలా.. అద్దెకు ఉండాలా?

చాలామందికి కలిగే ప్రధాన సందేహం.. ఇల్లు కొనేసుకోవాలా? లేక అద్దెకు ఉండాలా? అని. అయితే, ఇది వ్యక్తులు, నగరాలు, ఆదాయాలు, వివిధ పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సిన అంశం. బెంగళూరు, పుణె, కోల్ కతా, చెన్నైల్లో మూలధన విలువల కంటే సగటు అద్దె విలువలు భారీగా పెరిగాయి. అదే సమయంలో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లలో మాత్రం మూలధన విలువలు అద్దె విలువల కంటే ఎక్కువగా ఉన్నాయి. 2021 చివరి నుంచి 2024 ప్రథమార్థం వరకు బెంగళూరు, పుణె, కోల్ కతా, చెన్నైల్లో సగటు అద్దె రేట్లు మూలధన విలువల కంటే ఎక్కువయ్యాయని ప్రముఖ అనలిటిక్ సంస్థ అనరాక్ పేర్కొంది.

అదే సమయంలో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని.. ఆ నగరాల్లో అద్దె రేట్ల కంటే మూలధన విలువలు భారీగా పెరిగాయని వివరించింది. మొత్తమ్మీద దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లోని మైక్రో మార్కెట్లలో అద్దె విలువలు 72 శాతం పెరగ్గా.. మూలధన విలువలు మాత్రం నెమ్మదిగానే వృద్ది చెందాయని పేర్కొంది. బెంగళూరులోని సర్జాపూర్ రోడ్‌లో సగటు నెలవారీ అద్దె విలువలు 67 శాతం పెరగ్గా.. మూలధన విలువలు 54 శాతం పెరిగాయి. తన్నిసాంద్ర మెయిన్ రోడ్డు వద్ద సగటు అద్దె విలువలు 56% పెరగ్గా.. మూలధన విలువలు 52 శాతం పెరిగాయి. పుణెలోని హింజేవాడి అద్దె విలువలు 52% పెరగ్గా.. మూలధన విలువలు కేవలం 31 శాతం పెరిగాయి. కోల్‌కతాలోని ఈఎం బైపాస్‌లో అద్దె విలువ 46 శాతం పెరగ్గా.. మూలధన విలువల పెరుగుదల కేవలం 15 శాతం మాత్రమే. చెన్నైలోని పల్లవరంలో అద్దె విలువ 40 శాతం వృద్ధిని నమోదు చేయగా, మూలధన విలువలు 18 శాతమే పెరిగాయి. ఇక ఢిల్లీ విషయానికి వస్తే.. సోహ్నా రోడ్డులో అద్దె విలువలు 40 శాతం పెరగ్గా.. మూలధన విలువలు 54 శాతం పెరిగాయి. అలాగే నోయిడాలోని సెక్టార్-150 అద్దె విలువ 56 శాతం వృద్ధి నమోదు చేయగా..

మూలధన విలువలు 126 శాతం పెరిగాయి. ముంబైలోని చెంబూర్ లో అద్దె వృద్ధి 38 శాతం ఉండగా.. మూలధన విలువ 39 శాతం పెరిగింది. ఇక మన హైదరాబాద్ లో కూడా మూలధన విలువలే పెరిగాయి. హైటెక్ సిటీలో అద్దె విలువ వృద్ధి 46 శాతం పెరగ్గా.. మరియు మూలధన విలువ 59 శాతం మేర పెరిగింది. అలాగే గచ్చిబౌలిలో అద్దె విలువలు 50 శాతం, మూలధన విలువలు 70 శాతం పెరిగాయి.

కొనడమా.. అద్దెకు ఉండటమా?

అద్దె విలువలు, మూలధన విలువల పెరుగుదల అన్నిచోట్లా ఒకేలా లేదు. ఈ నేపథ్యంలో ఇల్లు కొనుక్కోవడం ఉత్తమమా? లేక అద్దెకు ఉంటే మంచిదా అనే సందేహాలు రావడం సహజం. ఆర్థిక వనరులు, ఉద్యోగ వృద్ధి అవకాశాలు, జీవిత దశ, కుటుంబ పరిమాణం, వ్యక్తిగత ప్రాధాన్యతలు ఇందులో కీలకపాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు బెంగళూరులో ఓ స్థిరమైన ఉద్యోగంలో ఉన్న వ్యక్తి రూ.1.2 కోట్ల విలువన 2 బీహెచ్ కేకి నెలవారీ రూ.50వేల అద్దె చెల్లిస్తుంటే తాను అద్దెకు ఉంటే లాభమా లేక ప్రాపర్టీ కొనుక్కుంటే లాభమా అని ఆలోచించక తప్పదు. అతడు అద్దెకే ఉంటే ఏడాదికి రూ.6 లక్షల అద్దె చెల్లించాలి. అలాగే తదుపరి పదేళ్లకు 7 శాతం వార్షిక అద్దె పెరుగుదలతో లెక్కిస్తే మొత్తం రూ.83 లక్షలు అవుతుంది.

ఇది ప్రాపర్టీ ఖర్చులో 69 శాతం. పైగా ఇది పెట్టుబడి విలువ లేకుండా కేవలం ఖర్చు మాత్రమే. ఈ నేపథ్యంలో రుణం తీసుకుని ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటే.. 20 శాతం డౌన్ పేమెంట్ చెల్లించి మిగిలిన మొత్తాన్ని 9.5 శాతం వడ్డీ రేటుతో 10 సంవత్సరాల కాల వ్యవధిలో రుణంగా తీసుకుంటే అది కచ్చితంగా లాభదాయకంగా ఉంటుందని అనరాక్ గ్రూప్ రీజియన్ డైరెక్టర్, రీసెర్చ్ హెడ్ ప్రశాంత్ ఠాకూర్ స్పష్టంచేశారు. అద్దెపై భారీ మొత్తాన్న వెచ్చించే బదులు నెలవారీ ఈఎంఐలు చెల్లించొచ్చని.. పదేళ్ల తర్వాత ఆస్తి సొంతమవుతుందని పేర్కొన్నారు. తక్కువగా ఉన్న వడ్డీ రేట్లు, పెరుగుతున్న మూలధన విలువలు, గృహరుణంపై పన్ను ప్రయోజనాలు తదితరాలు పరిగణనలోకి తీసుకుంటే అదనపు లబ్ధి చేకూరినట్టేననని వివరించారు.

This website uses cookies.