Categories: TOP STORIES

యూనిటెక్ ప్రాజెక్టు పనులు మళ్లీ మొదలు

మూడు ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన

2026 జూన్ 30కి డెలివరీ చేసేలా ప్రణాళిక

నోయిడాలో నిలిచిపోయిన యూనిటెక్ ప్రాజెక్టు పనుల్లో ముందడుగు పడింది. మూడు యూనిటెక్ ప్రాజెక్టులకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం తాజాగా జరిగింది. సుప్రీంకోర్టు నియమించిన యూనిటెక్ బోర్డు నోయిడా సెక్టార్ 96లోని యూనిటెక్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్ లో ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించింది. దీంతో 5,586 మంది కొనుగోలుదారుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్ ప్రెస్‌వే వెంబడి 96, 97, 98 సెక్టార్లలో అంబర్, బుర్గుండి, విల్లోస్ అనే మూడు ప్రాజెక్టులను యూనిటెక్ సంస్థ 2006లో ప్రారంభించింది. అంబర్, బుర్గుండి లగ్జరీ గ్రూప్ హౌసింగ్ టవర్లు కాగా, విల్లోస్ అనేది బంగ్లాల ప్రాజెక్ట్. అయితే, నిధుల కొరత, ఇతరత్రా అంశాల నేపథ్యంలో అవి ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో అనేక నాటకీయ పరిణామాల అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ పనులు పునరుద్ధరించారు.

ఈ ప్రాజెక్టులకు సంబంధించి పనులు తిరిగి ప్రారంభమైనందున 2026 జూన్ 30 తర్వాత ఇంటి కొనుగోలుదారులకు అంబర్, బర్గండీ ప్రాజెక్టులను డెలివరీ చేస్తామని యూనిటెక్ బోర్డు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వైఎస్ మాలిక్ తెలిపారు. విల్లోస్ లోని ప్లాట్లను ఆరు నెలల్లో పంపిణీ చేస్తామన్నారు. యూనిటెక్ గోల్ఫ్ కోర్స్ చుట్టూ 5 మీటర్ల వెడల్పు, 3.4 కిలోమీటర్ల పొడవైన నడక మార్గాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. గృహ కొనుగోలుదారులకు డెలివరీని వేగవంతం చేయడానికి, నిర్మాణానికి అవసరమైన నిధులను సేకరించేందుకు ఇప్పటివరకు అమ్ముడుపోని ప్లాట్లను వచ్చే జనవరిలో అమ్మాలని భావిస్తున్నట్టు చెప్పారు.

ఈ మూడు ప్రాజెక్టులు 164 ఎకరాల విస్తీర్ణంలో 818 అపార్ట్ మెంట్లు అందుబాటులోకి వస్తాయి. రెండు ప్రాజెక్టుల్లో 638 మంది కొనుగోలుదారులు తమ ఫ్లాట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకా 180 ఫ్లాట్లు విక్రయించాల్సి ఉంది. అంబర్‌లో 422 అపార్ట్ మెంట్లతో కూడిన 7 టవర్లు ఉండగా.. బుర్గుండిలో 395 అపార్ట్ మెంట్లతో కూడిన ఏడు టవర్లు ఉన్నాయి. విల్లోస్‌లో బంగ్లాల కోసం 397 ప్లాట్లు ఉన్నాయి. మొత్తం మూడు సైట్‌లలో 5,586 మంది గృహ కొనుగోలుదారులు డెలివరీ కోసం ఎదురుచూస్తున్నారు.

ఇదీ యూనిటెక్ కథ..

యూనిటెక్ సంస్థ మూడు ప్రాజెక్టులు ప్రారంభించిన అనంతరం నిధుల లేమితో అవి ఆగిపోయాయి. భూమి, ఇతరత్రా ఖర్చుల నిమిత్తం నోయిడా అథార్టీకి సుమారు రూ.11వేల కోట్ల బకాయిలు పడింది. ఇవి ఏర్పాటు చేసుకోవడంలో విఫలమైంది. అలాగే ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులు కూడా సమకూర్చుకోలేదు. అదే సమయంలో యూనిటెక్ ప్రమోటర్లు చేసిన నిధుల మళ్లింపు మరిన్ని తలనొప్పులు తీసుకొచ్చింది. ఈ వ్యవహారంపై ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలు ఇంకా విచారణ జరుపుతున్నాయి. ఈ క్రమంలో యూనిటెక్ కంపెనీని నిర్వహించడానికి, ప్రాజెక్టు పనులు పునరుద్ధరించడానికి 2020లో యూనిటెక్ బోర్డు ఏర్పాటైంది. అనంతరం ఏప్రిల్ 26, 2024న సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి అధికార యంత్రాంగం సవరించిన మ్యాప్‌లను మే 30న ఆమోదించింది. జూన్ 25న డ్రాయింగ్‌లను విడుదల చేసి, సైట్‌లో నిర్మాణాన్ని పునఃప్రారంభించడానికి అనుమతించింది.

This website uses cookies.