Categories: TOP STORIES

టైర్-2 నగరాల్లో ఇళ్ల ధరలు రెట్టింపు

డిమాండ్ ఎక్కువగా ఉండటంతో
నాలుగేళ్లలో 94 శాతం పెరిగిన ధరలు

ప్రాప్ ఈక్విటీ నివేదిక వెల్లడి

దేశంలో ప్రధాన నగరాల్లోనే కాకుండా టైర్-2 నగరాల్లోనూ రియల్ రంగం పరుగులు తీస్తోంది. దేశంలోని టాప్-30 టైర్-2 నగరాల్లో ఇళ్ల ధరలు గత నాలుగేళ్లలో రెట్టింపు అయ్యాయి. విశాఖపట్నం, విజయవాడ, మైసూర్‌, నాసిక్‌, సూరత్‌, ఆగ్రా, భువనేశ్వర్‌, అహ్మదాబాద్‌ తదితర నగరాల్లో 2019-20 నుంచి 2023-24 మధ్య కాలంలో ఇళ్ల ధరలు 94 శాతం మేర పెరిగినట్టు రియల్‌ ఎస్టేట్‌ డేటా విశ్లేషణ సంస్థ ప్రాప్‌ ఈక్విటీ వెల్లడించింది. ఆయా నగరాల్లో ఇళ్లకు బలమైన డిమాండ్‌ ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది. ఈ నగరాల్లోని వీటిల్లో టాప్‌-10లో ధరల పెరుగుదల 54-94 శాతం మధ్య ఉన్నట్టు వివరించింది.

ఆగ్రాలో ఇళ్ల ధరలు అత్యధికంగా 94 శాతం పెరిగి 2024 మార్చి నాటికి చదరపు అడుగు 8రూ.7,163గా ఉన్నట్టు తెలిపింది. ఆ తర్వాతో గోవాలో 90 శాతం, లుధియానాలో 89 శాతం, ఇండోర్‌లో 72 శాతం, చండీగఢ్‌లో 70 శాతం, డెహ్రాడూన్‌లో 68 శాతం, అహ్మదాబాద్‌లో 60 శాతం, భువనేశ్వర్‌లో 58 శాతం చొప్పున ఇళ్ల ధరలు పెరిగాయి. మంగళూరులో 57 శాతం, త్రివేండ్రమ్‌లో 54 శాతం పెరగ్గా.. విశాఖపట్నంలో అన్నింటకంటే తక్కువగా 11 శాతం మేర నాలుగేళ్ల కాలంలో ఇళ్ల ధరలు పెరిగినట్టు ‍ప్రాప్‌ ఈక్విటీ తన నివేదికలో వెల్లడించింది. డిమాండ్‌ అధికం కావడంతో ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఇళ్ల ధరలు గణనీయంగా పెరిగాయని ప్రాప్ ఈక్విటీ ఫౌండర్, సీఈఓ సమీర్ జసూజా పేర్కొన్నారు.

గత ఐదేళ్లలో కొత్త ఇళ్ల లాంచింగుల కంటే కొనుగోళ్లే అధికంగా ఉన్నట్టు చెప్పారు. ఆర్థికాభివృద్ధి, అనుసంధానత పెరగడం, మౌలిక వసతుల అభివృద్ధి, సానుకూల ఉద్యోగ మార్కెట్‌ వంటి అంశాలు వినియోగదారుల్లో విశ్వాసాన్ని అధికం చేశాయని.. ఫలితంగా ఈ నగరాల్లో ధరలు భారీగా పెరిగాయని వివరించారు.

This website uses cookies.