Categories: Rera

మరో ప్రీలాంచ్ మోసం

కొల్లూరులో విల్లాలు, అపార్ట్ మెంట్ల నిర్మిస్తున్నామని
మోసం చేసిన జీఎస్ఆర్ ఇన్ ఫ్రా

పలువురి నుంచి రూ.60 కోట్లు వసూలు

హైదరాబాద్‌లో మరో ప్రీలాంచ్‌ మోసం వెలుగులోకి వచ్చింది. తక్కువ ధరకే విల్లాలు, అపార్ట్ మెంట్లు నిర్మించి ఇస్తామని చెప్పి.. ముందుస్తుగా పలువురి నుంచి దాదాపు రూ.60 కోట్లు కొల్లగొట్టారు. ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టు అతీగతీ లేకపోవడంతో మోసపోయిన గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో సదరు సంస్థ ఎండీని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

గుంటూరుకు చెందిన గుంటుపల్లి శ్రీనివాసరావు.. చదలవాడ శ్రీనివాసరావు, వేమవరపు సత్యశిల్పలతో కలిసి రెండేళ్ల క్రితం జీఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రా గ్రూప్‌ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ సంస్థను ప్రారంభించారు. కొల్లూరులో విల్లాలు, అపార్ట్ మెంట్లు నిర్మిస్తున్నామని బ్రోచర్లు ముద్రించి బాగా ప్రచారం చేశారు. ప్రీలాంచ్‌ స్కీమ్‌లో తక్కువ ధరకే విల్లాలు, అపార్ట్ మెంట్లు ఇస్తామని వల వేశారు. అనంతరం 32 మంది నుంచి రూ.60 కోట్ల వరకు వసూలు చేశారు. ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామని.. లేకుంటే కట్టిన డబ్బును 24 శాతం వడ్డీతో తిరిగి చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నారు.

అయితే ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభం కాలేదు. దీని గురించి కొనుగోలుదారులు ప్రశ్నిస్తే.. సంబంధిత భూమి న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకుందని, కొంత కాలం పడుతుందంటూ కాలం గడిపేశారు. ఎన్ని రోజులు గడిచినా ప్రాజెక్టు పనులు ప్రారంభం కాలేదు. తమ డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగినా ఇవ్వలేదు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాసరావును అరెస్టు చేశారు.

This website uses cookies.