Categories: TOP STORIES

హైద‌రాబాద్‌లో ఇంటి అద్దెల‌కు రెక్క‌లు!

సిటీలో అద్దె ఇళ్లకు భారీగా పెరిగిన డిమాండ్

వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఆఫీస్ లకు వస్తున్న ఐటీ ఉద్యోగులు

5 నుంచి 15 శాతం పెరిగిన హౌజ్ రెంట్స్

డబుల్ బెడ్రూం ఇళ్లకు అధిక డిమాండ్

హైదరాబాద్ లో అద్దె ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. అంతే కాదు ఇంటి రెంట్స్ కూడా భారీగా పెరిగిపోతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఐటీ రంగ ఉద్యోగులంతా పూర్తిస్థాయిలో కార్యాలయాలకు వస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆఫీస్ లన్నీ ఎంప్లాయిస్ తో కళకళలాడుతున్నాయి. అయితే ఇదంతా ఇంటి అద్దెలపై ప్రభావం చూపుతోంది. హైదరాబాద్ లో ప్రాంతాన్ని బట్టి 5 నుంచి 15 శాతం మేర ఇంటి అద్దెలు పెరిగాయని రియాల్టీ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

దేశవ్యాప్తంగా స్థిరాస్తి రంగం మెల్ల మెల్లగా కుదుటపడుతోంది. నిన్నటి వరకు వర్క్ ఫ్రమ్ హోం పద్దతిలో పనిచేసిన ఐటీ ఉద్యోగులు మళ్లీ ఆఫీస్ బాట పడుతున్నారు. దీంతో మెట్రో నగరాల్లోని ఐటీ కార్యాలయాలన్నీ కళకళలాడుతున్నాయి. ఐటీ ఉద్యోగులతో పాటు, ఫార్మా, ఫైనాన్స్, బ్యాంకింగ్, మ్యానుఫాక్చరింగ్ రంగాల్లోని ఉద్యోగులు, కార్మికులు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి కార్యాలయాలకు వచ్చి పనిచేయడం మొదలవ్వడంతో సొంత ప్రాంతాల నుంచి నగరాలు, పట్టణాలకు వచ్చేస్తున్నారు ఉద్యోగులు.

దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో అద్దె ఇళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఎక్కడ టూలెట్ బోర్డు కనిపించినా వెంటనే ఎవరో ఒకరు అద్దెకు దిగిపోతున్నారు. ఇటువంటి సానుకూల పరిస్థితుల్లో అనూహ్యంగా ఇంటి అద్దెలపై ప్రభావం పడుతోంది. ఈ క్రమంలో ఇంటి రెంట్స్ క్రమంగా పెరిగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీలు, ప్రధాన కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో గృహాల అద్దెలు బాగా పెరిగిపోయాయి.

హైదరాబాద్‌లో లగ్జరీ గృహాల అద్దెలకు డిమాండ్‌ బాగా పెరిగింది. గడిచిన మూడు నెలల కాలంలో హైదరాబాద్ అద్దె ఇళ్లకు క్రమంగా డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఇదే సమయంలో గ్రేటర్ సిటీలో డబుల్ బెడ్రూం ఇళ్లకు బాగా డిమాండ్ ఏర్పడింది. మొత్తం గృహాల రెంట్ మార్కెట్లో డబుల్ బెడ్రూం ఇళ్ల వాటా 55 శాతం కాగా, సింగిల్ బెడ్రూం వాటా 23 శాతంగా, 3 బీహెచ్‌కే అద్దె ఇళ్ల డిమాండ్‌ 20 శాతం చొప్పున ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఇంటి అద్దెలు 5 శాతం నుంచి 15 శాతం మేర పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇక బాగ్యనగరంలో మణికొండ, కూకట్‌పల్లి, మాధాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, పుప్పాలగూడ, షేక్ పేట్, టోలీచౌకి, ఉప్పల్, ఎల్బీ నగర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లోని అద్దె గృహాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ప్రధాన ప్రాంతాలలో డిమాండ్‌ కు తగిన గృహాల సప్లయి లేకపోవటమే అద్దె పెరుగుదలకు కారణమని తెలుస్తోంది.

హైదరాబాద్ లో ప్రధాన ప్రాంతాల్లో ఇంటి అద్దెలను గమనిస్తే గచ్చిబౌలిలో డబుల్ బెడ్రూం ఇంటి అద్దె 30 వేలుండగా, త్రిపుల్ బెడ్రూం అద్దె 36 వేల రూపాయలుగా ఉంది. కొండాపూర్‌ లో 2బీహెచ్ కే 24 వేలు, త్రీ బీహెచ్ కే 30 వేల అద్దె చెల్లించాల్సి వస్తోంది. హైటెస్‌ సిటీ ప్రాంతంలో 2బీహెచ్కే 35 వేలు, త్రీబీహెచ్కే 47 వేల అద్దె ఉంది. మాధాపూర్‌ డబుల్ బెడ్రూం ఇంటి అద్దె 26 వేలుండగా, త్రిపుల్ బెడ్రూం ఇంటి అద్దె 35 వేల రూపాయలుగా ఉంది.

కోకాపేట్‌ లో 2 బీహెచ్కే సగటు ఇంటి అద్దె 26 వేలు, త్రీబీహెచ్కే 36 వేలు పలుకుతోంది. ఇక నార్సింగిలో డబుల్ బెడ్రూం సగటు ఇంటి అద్దె 24 వేలు కాగా, ట్రిపుల్ బెడ్రూం ఇంటి రెంట్ 34 వేలు. కూకట్‌పల్లిలో 2 బీహెచ్కే రెంట్ 20 వేలు, త్రీబీహెచ్కే రెంట్ 26 వేలు. మణికొండలో డబుల్ బెడ్రూం ఇంటి రెంట్ 25 వేలు కాగా, ట్రిపుల్ బెడ్రూం ఇంటి అద్దే 32 వేలుగా ఉంది. ఆయా ప్రాంతాల్లో లగ్జరీ అపార్ట్ మెంట్స్, గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఐతే ఇంకా రెంట్స్ ఎక్కువగానే ఉన్నాయి.

మొత్తానికి హైదరాబాద్ లో ఇంటి అద్దెలు పెరగడం సామాన్య, మధ్య తరగతి వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఉద్యోగాలు చేస్తున్న వారి వేతనాలు పెరగడం లేదు కానీ, గృహాల అద్దెలు మాత్రం పెరిగాయని, వచ్చిన జీతంలో సగానికి పైగా ఇంటి రెంట్ కే ఖర్చవుతోందని వాపోతున్నారు. నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ఇంటి అద్దెలు ఎక్కువగా ఉండటంతో నగర శివారు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు చాలా మంది మధ్యతరగతి ఉద్యోగులు.

This website uses cookies.