తెలంగాణలో భూముల బహిరంగ మార్కెట్ విలువలు పెరగబోతున్నాయి. వ్యవసాయ, వ్యవసాయేతర భూములతో పాటు అపార్ట్ మెంట్ల విలువలను పెంచేందుకు రంగం సిద్దమైంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అపార్ట్ మెంట్స్ మార్కెట్ విలువలు 25 శాతం నుంచి 30 శాతం మేర పెరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్స్ లో చదరపు అడుగుకు అత్యధికంగా 4,800 రూపాయలు ఉండగా, నెక్నాంపూర్ లో అత్యల్పంగా 2 వేల రూపాయలు ఉంది.
తెలంగాణలో భూముల బహిరంగ మర్కెట్ విలువలను పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములతో పాటు, అపార్ట్ మెంట్ల మార్కెట్ విలువలు ప్రాంతాన్ని బట్టి సుమారుగా 25 శాతం నుంచి 60 శాతం మేర పెంచనున్నట్లు తెలుస్తోంది. అందులోను అపార్ట్ మెంట్ల బహిరంగ మార్కెట్ ధరలు పెరగనుండటంతో ఇళ్లను కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారుల్లో ఆసక్తినెలకొంది.
రోడ్లు, మౌలిక వసతుల అభివృద్ది, రవాణా సౌకర్యాలు, డిమాండ్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అపార్ట్ మెంట్ల మార్కెట్ విలువలను పెంచబోతోంది రేవంత్ సర్కార్. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆయా ప్రాంతాలను బట్టి విలువల్లో స్వల్ప మార్పులు ఉండబోతున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్ల మార్కెట్ విలువలు 25 శాతం నుంచి 30 శాతం మేర పెరిగనున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
మరీ ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డిలో అపార్ట్ మెంట్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చదరపు అడుగు విలువను 25 శాతం నుంచి 30 శాతం మేర పెంచేందుకు రంగం సిద్దమైంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్ చదరపు అడుగు ప్రస్తుతం 4 వేల 800 రూపాయలు ఉండగా ఇది 6వేల రూపాయలకు పెరగనున్నట్లు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జూబ్లీహిల్స్ లోనే అపార్ట్ మెంట్ల మార్కెట్ విలువ అత్యధికంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన కోకాపేట్ లో చదరపు అడుగు 3 వేల రూపాయలు ఉండగా అది సుమారు 4 వేల రూపాయలకు పెరగవచ్చని చెబుతున్నారు.
మాదాపూర్, పుప్పాలగూడ, గండిపేట్, మణికొండ లో అపార్ట్ మెంట్ లో చదరపు అడుగు రిజిస్ట్రేషన్ విలువ 2,200 రూపాయలుగా ఉంది. అంటే ఇప్పుడు సుమారు 30 శాతం మేర మార్కెట్ విలువ పెరిగితే చదరపు అడుగు 2,800 నుంచి 3 వేల రూపాయల వరకు పెరిగే ఛాన్స్ ఉంది. రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్ల విలువలతో పాటు కమర్షియల్ నిర్మాణాల భహిరంగ మార్కెట్ విలువలు సైతం పెరగబోతున్నాయి. అందుకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ల చార్జీలు కూడా పెరగనుండటంతో, ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరగబోతోంది. ఈ ఆర్ధిక సంవత్సరం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా సుమారు 20 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
This website uses cookies.