హైదరాబాద్ రియల్ మార్కెట్ వేగం కాస్త తగ్గింది. ఇక్కడ ఇళ్ల విక్రయాల్లో తగ్గుదల నమోదైంది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే.. ఏప్రిల్-జూన్ కాలంలో ఇళ్ల అమ్మకాలు 14 శాతం మేర తగ్గినట్టు ప్రముఖ రియల్ ఎస్టేట్ బ్రోకరీజీ సంస్థ ప్రాప్ టైగర్ డాట్ కామ్ తన తాజా నివేదిక వెల్లడించింది.
జనవరి-మార్చి క్వార్టర్ లో 14,298 యూనిట్లు అమ్ముడుకాగా, జూన్ త్రైమాసికంలో 12,296 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ నగరాల్లోని ఇళ్ల అమ్మకాలు 6 శాతం తగ్గాయి. జనవరి-మార్చి త్రైమాసికంలో ఈ నగరాల్లో మొత్తం 1,20,642 ఇళ్లు విక్రయం కాగా, జూన్ క్వార్టర్లో 6 శాతం తగ్గుదల నమోదై 1,13,768 యూనిట్లుగా ఉన్నట్టు ప్రాప్‌టైగర్ పేర్కొంది. ఈ ఎనిమిది నగరాల్లో అమ్మకాలు, క్రితం ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో విక్రయాలు 80,245 యూనిట్లతో పోల్చి చూస్తే 42 శాతం పెరగడం గమనార్హం. అలాగే హైదరాబాద్ లో కొత్త ఇళ్ల సరఫరాలో ఏకంగా 58 శాతం తగ్గుదల నమోదైంది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో 15,095 కొత్త యూనిట్లు లాంచ్ కాగా, జూన్ త్రైమాసికంలో 6,365 యూనిట్లు మాత్రమే లాంచ్ అయ్యాయి. దేశవ్యాప్తంగా కొత్త ఇళ్ల సరఫరా అంత క్రితం త్రైమాసికంతో పోల్చితే జూన్ క్వార్టర్లో 1 శాతం తగ్గి 1,01,677 యూనిట్లుగా ఉన్నట్టు ప్రాప్‌టైగర్ నివేదిక వెల్లడించింది.
ఇక నగరాలవారీగా ఇళ్ల అమ్మకాలు చూస్తే.. అహ్మదాబాద్‌లో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 26 శాతం తగ్గి 9,500 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఈ ఏడాది జనవరి-మార్చి క్వార్టర్‌లో విక్రయాలు 12,915 యూనిట్లుగా ఉన్నాయి. బెంగళూరులో మార్చి త్రైమాసికంలో 10,381 యూనిట్లు అమ్ముడుకాగా, జూన్ త్రైమాసికంలో 30 శాతం పెరుగుదలతో 13,495 యూనిట్లు అమ్మడుయ్యాయి. చెన్నైలో ఇళ్ల అమ్మకాలు 10 శాతం వృద్ధితో 3,984 యూనిట్లకు చేరాయి. మార్చి క్వార్టర్‌లో ఇక్కడ 4,427 యూనిట్ల విక్రయం జరిగింది. ఢిల్లీలో 10 శాతం పెరుగుదలతో 11,065 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. కోల్‌కతా మార్కెట్లో 3,237 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. జనవరి-మార్చి క్వార్టర్‌లో విక్రయాలు 3,857 యూనిట్లుగా ఉన్నాయి.
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ఇళ్ల అమ్మకాలు 8 శాతం క్షీణించి 38,266 యూనిట్లకు పరిమితమయ్యాయి. పుణె మార్కెట్లోనూ 5 శాతం క్షీణతతో 21,925 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ‘రియల్ ఎస్టేట్ పట్ల వినియోగదారుల్లో సానుకూల ధోరణి ఉన్పప్పటికీ, ఏప్రిల్-జూన్ కాలంలో ఇళ్లకు డిమాండ్ మోస్తరుగా ఉండడానికి సాధారణ ఎన్నికలే కారణం. డెవలపర్లు సైతం కొంత అప్రమత్తంగా వ్యవహరించారు. ఫలితంగా కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణ తగ్గింది. కేంద్రంలో నూతన ప్రభుత్వం పెట్టుబడుల అనుకూల బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందన్న అంచనాల మధ్య రానున్న త్రైమాసికాల్లో, ముఖ్యంగా పండుగల రోజుల్లో ఇళ్ల అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం’’ అని ఆర్‌ఈఏ ఇండియా గ్రూప్ సీఎఫ్‌వో వికాస్ వాద్వాన్ పేర్కొన్నారు.
This website uses cookies.