Categories: TOP STORIES

రియాల్టీలోకి రూ.25వేల కోట్ల పీఈ పెట్టుబడులు

ఈ ఏడాది ప్రథమార్ధంలో నిధుల ప్రవాహం

గతేడాది తొలి ఆరు నెలలతో పోలిస్తే 15 శాతం అధికం

12 శాతం వాటాతో హైదరాబాద్ కు రూ.3వేల కోట్ల పెట్టుబడులు

నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడి

భారత రియల్ రంగంలో ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు దుమ్ము రేపాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో భారత రియల్ ఎస్టేట్ లోకి 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25వేల కోట్లు) పెట్టుబడులు వచ్చాయి. గతేడాది ఇదే సమయంలో వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. ఈ మేరకు వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. మొత్తం పీఈ పెట్టుబడుల్లో వేర్ హౌసింగ్ విభాగం 52 శాతం వాటాతో అత్యధిక వాటా కలిగి ఉండగా.. 29 శాతంతో రెసిడెన్షియల్ విభాగం, 20 శాతంతో ఆఫీసు విభాగం తర్వాతి స్థానాల్లో ఉన్నాయని పేర్కొంది.

పీఈ పెట్టుబడుల్లో వాటాపరంగా రెసిడెన్షియల్ రంగం రెండో స్థానంలో ఉన్నప్పటికీ, గతేడాది ప్రథమార్థంలో వచ్చిన 277 మిలియన్ డాలర్లతో పోలిస్తే ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 209 శాతం పెరుగుదలతో 854 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. వాస్తవానికి 2018 వరకు రెసిడెన్షియల్ విభాగంలోకే పీఈ పెట్టుబడులు అధికంగా వచ్చేవి. అలాంటిది ఈ పరిస్థితిలో ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. ఆఫీసు స్పేస్ కోసం భవనాలు నిర్మించే కంపెనీల్లో పెట్టుబడులకు కూడా పీఈ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. దేశంలో ఈ కామర్స్ సంస్థలు వేగంగా విస్తరిస్తుండటంతో గోదాముల అవసరం పెరుగుతోంది. దీంతో వేర్ హౌసింగ్ రంగంపై పీఈ సంస్థలు దృష్టి పెట్టాయి. దీంతో ఈ ఏడాది ప్రథమార్థంలో ఈ విభాగంలోకి 176 శాతం అధికంగా 1532 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.12,700 కోట్లు) పెట్టుబడులు వచ్చాయి. 2023 తొలి ఆరు నెలల్లో ఇది 555 మిలియన్ డాలర్లుగానే ఉంది.

ఇక హైదరాబాద్ విషయానికి వస్తే.. ఈ ఏడాది ప్రథమార్ధంలో రియల్ సంస్థలకు 357 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.3వేల కోట్లు) పెట్టుబడులు వచ్చాయి. మొత్తం పీఈ పెట్టుబడుల్లో ఇది 12 శాతం. అత్యధికంగా ముంబై 1702 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించగా.. 581 మిలియన్ డాలర్లతో బెంగళూరు రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ, పుణె, చెన్నైలు హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గత దశాబ్ద కాలంలో ఆర్థిక స్థిరత్వం, వృద్ధి కారణంగా భారతదేశం పెట్టుబడులకు అనుకూలంగా ఉందని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు. ఫలితంగానే మనదేశంలో స్థిరాస్తి రంగంపై పీఈ సంస్థలు అధికంగా పెట్టుబడులు పెడుతున్నాయని వివరించారు. ఐటీ ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వస్తుండటంతో ఆఫీసు స్థలాలకు డిమాండ్ పెరిగిందని తెలిపారు. అధిక ఆర్థికాభివృద్ధి వల్ల సగటు ఆదాయాలు పెరగడంతో ఇళ్లకూ డిమాండ్ ఉందని వివరించారు.

This website uses cookies.