లలితా కన్ స్ట్రక్షన్స్, ఇతరుల అనుతులు రద్దు చేయాలి
నగరంలో ఇంకెన్ని ఇలాంటి అక్రమ కట్టడాలున్నాయి?
ఎంతమంది బిల్డర్లు ఆమ్యామ్యాలిచ్చి అనుమతి తెచ్చుకున్నారు?
నగరంలో చెరువుల్ని ఆనుకుని కడుతున్న నిర్మాణాలపై అధ్యయనం చేయాలి
చిన్నపాటి వర్షం వస్తే చాలు.. హైదరాబాద్ మహానగరం నీట మునుగుతుంది. రోడ్లు, కాలనీలు జలమయమవుతాయి. చెరువులను కబ్జా చేసి, నాలాలు ఆక్రమించేసి ఇళ్ల నిర్మాణాలు చేయడంతోనే ఈ పరిస్థితికి కారణం అనే విషయం అందరికీ తెలిసిందే. అమీన్ పూర్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడి నాలాలు ఆక్రమణకు గురికావడం నిజమేనని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్ జీటీ) నియమించిన సంయుక్త కమిటీ నిర్ధారించింది. ఈ కారణంగానే వర్షాలు వచ్చినప్పుడు సమీపంలోకి కాలనీలు ముంపునకు గురవుతున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో అక్కడ లలితా కన్ స్ట్రక్షన్స్ తోపాటు ఇతరులకు ఇచ్చిన ఇళ్ల నిర్మాణ అనుమతులను వెంటనే రద్దు చేయాలని సిఫార్సు చేసింది. అమన్ పూర్ లోని కొత్త చెరువు, బంధం కొమ్ము వద్ద ఐదు టవర్ల నిర్మాణానికి లలితా కన్ స్ట్రక్షన్స్ కు అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ మానవ హక్కులు, వినియోగదారుల పరిరక్షణ సెల్ ట్రస్ట్, కృష్ణా బృందావన్ అసోసియేషన్ కలిసి ఎన్ జీటీని ఆశ్రయించాయి. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరపడానికి సంయుక్త కమిటీని ఏర్పాటు చేసింది.
సంగారెడ్డి కలెక్టర్, ఇరిగేషన్ శాఖ సీనియర్ అధికారులు, చెరువు పరిరక్షణ కమిటీ ప్రతినిధులతో కూడిన ఈ కమిటీ తాజాగా తన నివేదిక సమర్పించింది. వరదనీరు పారే ప్రాంతాలలో ఆక్రమణలు, నిర్మాణాలు గుర్తించామని.. వాటి వల్లే వర్షాల సమయంలో నీరు వెళ్లే దారిలేక ఆ ప్రాంతంలోని కాలనీలు జలమయం అవుతున్నాయని నిర్ధారించింది. లలితా కన్ స్ట్రక్షన్స్ బఫర్ జోన్ లో క్లబ్ హౌస్ నిర్మించిందని.. అలాగే వేములవాడ కుమార స్వామి అనే వ్యక్తి మూడు ఇళ్లు నిర్మించారని పేర్కొంది. వీటి కారణంగానే అక్కడ ముంపు సమస్య అధికమైందని వివరించింది. ఈ నేపథ్యంలో తక్షణమే లలితా కన్ స్ట్రక్షన్స్ తోపాటు ఇతరులకు ఇచ్చిన ఇళ్ల నిర్మాణ అనుమతులను రద్దు చేయాలని సూచించింది.
లలితా కన్ స్ట్రక్షన్స్ కాకుండా హైదరాబాద్లో ఇంకెన్ని నిర్మాణ సంస్థలు స్థానిక సంస్థల్ని మేనేజ్ చేసి అనుమతుల్ని తెచ్చుకున్నాయి? శేరిలింగంపల్లి పరిధిలో కొందరు బడా బాబులు అధికారులకు అమ్యామ్యాలిచ్చి అనుమతుల్ని తెచ్చుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా నిర్మాణాలకు గోప్యంగా అనుమతుల్ని మంజూరు చేశారనే ఆరోపణలున్నాయి. మదీనాగూడ, మియాపూర్లో కూడా ఇదేవిధంగా చెరువుల్ని కబ్జా చేసుకుని నిర్మాణాల్ని కట్టిన వారు పెద్ద బిల్డర్లుగా చెలామణి అవుతున్నారని సమాచారం. ఈ సంస్థలు అపార్టుమెంట్లను కట్టేందుకు నీటిపారుదల శాఖ అధికారులతో పాటు స్థానిక సంస్థల సిబ్బంది పూర్తి సహాయ సహకారాల్ని అందించారని తెలిసింది. ఇలాంటి నిర్మాణాలకు అనుమతిని రద్దు చేస్తే తప్ప కొత్తగా ఎవరూ చెరువుల్ని కబ్జా చేసే సాహసం చేయరని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే చెరువుల్ని కబ్జా చేసి అపార్టుమెంట్లను కట్టిన బిల్డర్లపై భారీ స్థాయిలో జరిమానాను వసూలు చేయాలని సూచిస్తున్నారు.