Categories: TOP STORIES

తెలంగాణ‌లో ఎన్ని “సాహితీ”లున్నాయి?

(కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌)

 

  • రెరా నిర్ల‌క్ష్యంతో.. రెచ్చిపోతున్న అక్ర‌మార్కులు
  • ప్రీలాంచుల్ని అరిక‌ట్ట‌డంలో పూర్తిగా విఫ‌లం
  • ప్రీలాంచు ప్రాజెక్టుల డేటాబేస్ రూపొందించాలి
  • వాటి ప్ర‌స్తుత ప‌రిస్థితిని అంచ‌నా వేయాలి
  • క‌ట్ట‌డి చేయ‌క‌పోతే భ‌విష్య‌త్తులో క‌ష్ట‌మే!

భార‌త‌దేశంలోనే ఎక్క‌డా లేని విధంగా.. రెరా అథారిటీ ఏర్పాటైన త‌ర్వాత.. హైద‌రాబాద్‌లో ప్రీలాంచ్ స్కాములు జ‌ర‌గ‌డం దారుణ‌మైన విష‌య‌మ‌ని నిపుణులు అంటున్నారు. రెరా రాక ముందు అంటే.. గుర్గావ్‌, నొయిడాలో అనేక‌మంది డెవ‌ల‌ప‌ర్లు.. ఛానెల్ పార్ట‌న‌ర్ల ద్వారా.. అమాయ‌క ప్ర‌జ‌ల‌కు కుచ్చుటోపి పెట్టిన విష‌యం తెలిసిందే. ఇలాంటి ఇబ్బందులు భ‌విష్య‌త్తులో ఏర్ప‌డ‌కూడ‌ద‌నే ఉద్దేశ్యంతోనే.. గ‌త‌ కాంగ్రెస్ ప్ర‌భుత్వం రెరా చ‌ట్టానికి రూప‌క‌ల్ప‌న చేసింది. బీజేపీ ప్ర‌భుత్వం అమ‌ల్లోకి తెచ్చింది. ఫ‌లితంగా మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, హ‌ర్యానా, ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఏ రాష్ట్రంలోనూ ప్రీలాంచ్ స్కాములు జ‌రిగిన సంద‌ర్భం లేదు. కానీ, మ‌న తెలంగాణ‌లో మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా జ‌రిగింది. పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ఉన్న‌త ఆశ‌యంతో ఏర్పాటు చేసిన ఈ రెరా అథారిటీ.. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్య‌మైంది. దేశ‌మంత‌టా తెలంగాణ రాష్ట్ర ప‌రువు పోయేలా చేసిందీ సాహితీ సంస్థ ప్రీలాంచ్ సంఘ‌ట‌న‌. ప్ర‌జ‌ల్నుంచి అక్ర‌మంగా సొమ్ము వ‌సూలు చేస్తున్న బిల్డ‌ర్ల‌ను ప్ర‌భుత్వం నియంత్రించ‌లేక‌పోయింద‌నే అప‌వాదు ఏర్ప‌డింది.

ప్రీలాంచ్ కంపెనీల‌కు లెక్కే లేదు

హైద‌రాబాద్‌లో ప్రీలాంచ్‌లో ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తున్న సంస్థ‌లు త‌క్కువేం కాదు. ఇవ‌న్నీ మూడు పూవులు ఆరు కాయ‌లుగా ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తోంది. ఐరా రియాల్టీ, భువ‌న‌తేజ‌, ఆర్జే గ్రూప్‌, జ‌య గ్రూప్‌.. ఇలా చెప్పుకుంటూ వంద‌కు పైగా సంస్థ‌లు ఈ అక్ర‌మ దందాకు తెర‌లేపాయి. వాస్త‌వానికి, సాహితీ త‌ర్వాత అర్బ‌న్ రైజ్ అనే సంస్థ ప్రీలాంచ్ అమ్మ‌కాల్లో ఆరి తేరింది. ఈ కంపెనీ మూడు ప్రాజెక్టుల‌ను ప్రీలాంచ్‌లోనే విక్ర‌యించింది. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అంశం ఏమిటంటే.. ఈ మూడు ప్రాజెక్టుల‌కు తెలంగాణ రెరా అథారిటీ తుది అనుమ‌తిని మంజూరు చేసింది. అంటే, ప్రీలాంచ్‌లు చేసినా ఫ‌ర్వాలేదు.. రెరా నుంచి అనుమ‌తి తెచ్చుకోవ‌చ్చ‌నే సందేశాన్నిచ్చింది. ఫ‌లితంగా, ప్రీలాంచ్ కంపెనీల‌కు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. అస‌లు ప్రీలాంచ్ చేయ‌క‌పోతే అదేదో పెద్ద త‌ప్పుగా భావించే స్థాయికి ఇలాంటి అక్ర‌మార్కులు మార్కెట్‌ను తీసుకొచ్చారు. ప్రీలాంచులు చేయ‌ని బిల్డ‌ర్లు సైతం తాము వెన‌క‌ప‌డిపోతున్నామ‌నే భావించే స్థాయికొచ్చారు.

రెరా పూర్తి నిర్ల‌క్ష్యం..

సాహితీ సంస్థ ఎండీ ప్రీలాంచుల్లో సొమ్ము వ‌సూలు చేస్తున్నాడ‌ని తెలిసి.. తెలంగాణ రెరా అథారిటీ పూర్తిగా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింద‌నే విష‌యం ప్ర‌తిఒక్క‌రికీ అర్థ‌మైంది. సాహితీ సంస్థ‌కు 2018లోనే ఎందుకు నోటీసుల్ని అందించ‌లేదు? ఒక‌వేళ అందించానా, ఆత‌ర్వాత ఎందుకు ప‌ట్టించుకోలేదు. ఒక‌వేళ‌, రెరా అథారిటీ ముందే స్పందించి, నోటీసులను అందించి, త‌గిన చ‌ర్య‌ల్ని తీసుకుని ఉంటే.. ఇంత‌మంది ఇళ్ల కొనుగోలుదారులు మోస‌పోయేవారు కాదు క‌దా! అస‌లు తెలంగాణ రాష్ట్రంలో రెరా అథారిటీని ఏర్పాటు చేసిందే అమాయక కొనుగోలుదారుల నుంచి మోస‌పూరిత బిల్డ‌ర్ల నుంచి కాపాడటానికే. ఇదే విష‌యాన్ని రెరా కార్యాల‌యం ప్రారంభోత్స‌వం రోజున మంత్రి కేటీఆర్ తెలిపారు కూడా. అయిన‌ప్ప‌టికీ, రాష్ట్రంలో అక్ర‌మంగా ఓ సంస్థ య‌జ‌మాని రూ.900 కోట్ల వ‌సూలు చేశాడంటే.. రెరా అథారిటీ మొద్దునిద్ర పోతుంద‌నే విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. జయ గ్రూప్ అనే సంస్థ మధ్యతరగతి ప్రజల్ని టార్గెట్ చేస్తూ.. అక్రమంగా కోట్ల రూపాయల్ని వసూలు చేస్తోందని సమాచారం. ఈ కంపెనీ ఎక్కువగా బాచుపల్లి, ప్రగతినగర్, అమీన్ పూర్, కొల్లూరు వంటి ప్రాంతాల్లో తక్కువ రేటుకే ఫ్లాట్లు అంటూ కోట్ల రూపాయల్ని వసూలు చేస్తోందని తెలిసింది. ఇలాంటి కంపెనీలను కట్టడి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

* రాష్ట్రంలో రెరా ఛైర్మ‌న్‌గా రాజేశ్వ‌ర్ తివారీ ఉన్నంత కాలం స‌జావుగా సాగింది. ఆయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ చేశాక.. అప్ప‌టికే వాణిజ్య ప‌న్నుల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా ప‌ని చేస్తున్న సోమేష్ కుమార్ కు రెరా బాధ్య‌త‌ల్ని ప్ర‌భుత్వం అద‌నంగా క‌ట్ట‌బెట్టింది. ఆత‌ర్వాత ఆయ‌న ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌దోన్న‌తి పొంద‌డంతో రెరా అథారిటీకి క‌ష్ట‌కాలం ఏర్ప‌డింది. ఎందుకంటే, రాష్ట్రం మొత్తాన్ని ప‌ర్య‌వేక్షించే సోమేష్ కుమార్‌కు రెరా మీద దృష్టి పెట్టేంత తీరిక లేకుండా పోయింది. ఈ బాధ్య‌త నుంచి ఆయ‌న్ని త‌ప్పించే వేరే అధికారికి పూర్తి స్థాయి అధికారాన్ని ఇచ్చి ఉంటే.. ప‌రిస్థితి మెరుగ్గా ఉండేది. సాహితీ వంటి సంస్థ‌ల‌కు ఆదిలోనే అడ్డుక‌ట్ట ప‌డేది. కానీ, రెరా అథారిటీ ఏర్ప‌డిన త‌ర్వాత‌.. సాహితీ ప్రీలాంచ్ స్కామ్ వెలుగులోకి రావ‌డం ప్ర‌భుత్వంపై చెర‌గ‌ని మ‌చ్చ ఏర్ప‌డింద‌ని రియ‌ల్ట‌ర్లు సైతం అంగీక‌రిస్తున్నారు.

ఇప్ప‌టికైనా ఇలా క‌ట్ట‌డి చేయాలి!

రాష్ట్ర ప్ర‌భుత్వం ముంద‌స్తుగా ఆలోచించి.. సాహితీ వంటి స్కామ‌ర్లు మార్కెట్లో ఎంత‌మంది ఉన్నారో ఆరా తీయాలి. వారి వివ‌రాల్ని తెలంగాణ రెరా అథారిటీ పూర్తిగా సేక‌రించాలి.

  • కొనుగోలుదారులు ఏయే సంస్థ‌ల వద్ద ప్రీలాంచుల్లో ఫ్లాట్లు కొన్నారో.. వారి స‌మాచారాన్ని అంద‌జేయాల‌ని రెరా అథారిటీ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేయాలి. ఫ‌లితంగా, ఈ ప్రీలాంచుల్లో ఫ్లాట్లు అమ్మిన వారికి కొంత భ‌యం ఏర్ప‌డుతుంది.
  • ప్రీలాంచ్ సంస్థ‌ల‌కు నోటీసులిచ్చి.. ప్రాజెక్టుల పురోగ‌తి గురించి తెలుసుకోవాలి. ఆయా ప్రాజెక్టుల త‌మ ప‌రిధిలోకి రావు క‌దా అని భావించ‌కుండా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్ని తీసుకోవాలి.
  • ప్రీలాంచుల్లో అమ్మిన డెవ‌ల‌ప‌ర్ల‌తో క‌లిపి రెరా అథారిటీ ఒక డేటా బేస్ త‌యారు చేయాలి.
  • ఇక నుంచి రాష్ట్రంలో ప్రీలాంచుల్లో ఫ్లాట్లు అమ్మ‌కూడ‌ద‌ని పెద్ద ఎత్తున ప్ర‌క‌ట‌న‌ల్ని విడుద‌ల చేయాలి.
  • ప్ర‌భుత్వం ముంద‌స్తుగా ఆలోచించి క‌ట్టుదిట్ట చ‌ర్య‌ల్ని తీసుకుంటే త‌ప్ప‌.. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని స్కాముల్లో ప్ర‌జ‌లు సొమ్ము పెట్ట‌కుండా ఉంటారు.
  • మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జానీకాన్ని దృష్టిలో పెట్టుకుని.. ప్ర‌భుత్వం అందుబాటు ధ‌ర‌లో ఇళ్ల‌ను నిర్మించే ప్ర‌య‌త్నాల‌ను మొద‌లెట్టాలి. లేక‌పోతే, త‌లాతోక లేని బిల్డ‌ర్లు త‌క్కువ రేటుకే ఫ్లాటు అని ప్ర‌క‌ట‌న‌ల్ని గుప్పిస్తే.. అమాయ‌క కొనుగోలుదారులు అందులో సొమ్ము పెట్టి మోస‌పోయే ప్ర‌మాద‌ముంది.
  • ప్ర‌భుత్వం బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించి.. పూర్తి స్థాయి రెరా అథారిటీతో పాటు అప్పీలేట్ ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేయాలి. దేశవ్యాప్తంగా రెరా చట్టం 2016లో అమల్లోకి వచ్చినప్పటికీ మన రాష్ట్రంలో 2018లో ప్రారంభించారు. అప్పట్నుంచి ఈ అథారిటీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను నమోదు చేస్తుందే తప్ప.. ఈ రంగంలో ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారం చూపెట్టడం లేద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

ప్రీలాంచుల్ని ప్రోత్స‌హించే..
యూట్యూబ్ ఛానెళ్ల‌ను నిషేధించాలి

రాష్ట్రంలో కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు ప్రీలాంచ్ అమ్మ‌కాల్ని ప్ర‌త్యేకంగా ప్రోత్స‌హిస్తున్నాయి. ప్రీలాంచ్ ఆఫ‌ర్ల‌ను వివ‌రిస్తూ క‌థ‌నాల్ని అంద‌జేస్తున్నాయి. ఫ‌లానా ప్రాజెక్టులో పెట్టుబ‌డి పెడితే.. రెట్టింపు రాబ‌డి వ‌స్తుందంటూ ఊక‌దంపుడు ప్ర‌చారాన్ని నిర్వ‌హిస్తున్నాయి. ఇలాంటి ఛానెళ్ల‌పై తెలంగాణ రెరా అథారిటీ వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాలి. ఆయా ఛానెళ్లను నిషేధించాలి.

This website uses cookies.