రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు దాకా హైదరాబాద్ మెట్రో రైలు ప్రతిపాదన కొత్తదేం కాదు. కొన్నేళ్ల క్రితమే పురుడుపోసుకున్న ఈ ఐడియాను నిధుల కొరత కారణంగా ప్రభుత్వం పక్కన పెట్టేసింది. ఈ అంశం పలుసార్లు సీఎం కేసీఆర్ వద్దకెళ్లినా ఆయన పెద్దగా పట్టించుకోలేదని తెలిసింది. అయితే, హఠాత్తుగా ఎందుకు ప్రభుత్వానికి ఈ ఎయిర్‌పోర్టు మీద మక్కువ ఏర్పడింది? దీని వల్ల రియల్ రంగానికి కానీ మెట్రో రైలు ప్రయాణీకులకు కానీ ప్రయోజనం ఉంటుందా? లేదా? అనే అంశాన్ని పక్కన పెడితే.. ప్రభుత్వానికి ఎంతో ఉపయోగకరంగా మారుతుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఎలాగో తెలుసా?
ఎలక్షన్ ఇయర్‌లోకి అడుగుపెట్టాం.. కేంద్రం నుంచి పెద్దగా మద్ధతు లభించట్లేదు.. ఏదోరకంగా ప్రభుత్వానికి నిధులు కావాలి.. అందుకే, ఈజీ మనీ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో.. మెట్రో రైలు., భూముల వేలం ప్రతిపాదనను ఉన్నతాధికారులు ప్రభుత్వం ముందు ఉంచారు. అంతే, సీఎం కేసీఆర్‌కు తెగ నచ్చేసినట్లుంది. అందుకే, వెంటనే ఆయన మెట్రో రైలు ప్రతిపాదనకు పచ్చజెండా ఊపారని తెలిసింది. ఇంతకీ, ఏమిటీ ప్రతిపాదనంటే..
రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు దాకా మెట్రో రైలును ప్రకటిస్తే.. సుమారు ఆరు వేల కోట్లు ఖర్చవుతుంది. కాకపోతే, దీని వల్ల నలభై వేల కోట్ల సొమ్మును సమీకరించే మాస్టర్ ప్లాన్ ప్రభుత్వం వేసినట్లు సమాచారం. ఈ మెట్రో రైలును బూచిగా చూపెట్టి.. బుద్వేల్ ఐటీ పార్కు నుంచి శంషాబాద్ దాకా ఉన్న సుమారు వెయ్యి ఎకరాల స్థలాన్ని వేలం వేసి విక్రయించేందుకు భావిస్తున్నారని తెలిసింది. బుద్వేల్ ఐటీ పార్కు స్థలాన్ని లెక్కిస్తే.. మొత్తం కలిపి ఎంతలేదన్నా ఐదు వందల ఎకరాల దాకా ఉంటుంది. ఆతర్వాతి ఏరియా నుంచి శంషాబాద్ విమానాశ్రయం దాకా మరో 500 ఎకరాల స్థలం ఉన్నట్లు సమాచారం.
ఇదంతా ప్రభుత్వ భూమి కావడం వల్ల.. ఆయా ప్రాంతంలో బడా బడా రహదారులు వేసి.. ఎకరానికి రూ.40 కోట్ల చొప్పున విక్రయించాలన్నది ప్రభుత్వ ప్రణాళికగా కనిపిస్తోంది. అంటే, వెయ్యి ఎకరాలను విక్రయిస్తే.. ప్రభుత్వ ఖజానాలోకి ఎంతలేదన్నా రూ. 40 వేల కోట్లు చేరే అవకాశముంది. ఇందులో నుంచి ఓ ఆరు వేల కోట్లను మెట్రో రైలు కోసం ఖర్చు చేసినా.. మిగతా సొమ్మును ఇతర అవసరాల నిమిత్తం వినియోగించాలన్నది ప్రభుత్వ ప్రణాళిక అయ్యి ఉంటుంది. పైగా, చెరువు పక్కనే భూములు ఉండటం వల్ల.. లేక్ వ్యూ కాన్సెప్టును చూపెట్టి ప్రభుత్వం మార్కెటింగ్ చేసే అవకాశముంది.
This website uses cookies.