హఫీజ్ పేట్ సర్వే నెంబర్ 80లోని వివాదాస్పద భూమిలో.. బిల్డాక్స్ అనే కొత్త నిర్మాణ సంస్థ.. ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను విక్రయిస్తున్న విషయాన్ని రెజ్‌న్యూస్ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో, రంగంలోకి దిగిన టీఎస్ రెరా అథారిటీ బిల్డాక్స్ సంస్థకు రెండోసారి నోటీసునిచ్చింది. మరి, దీనిపై బిల్డాక్స్ స్పందించిందా? లేదా? అనే విషయాన్ని టీఎస్ రెరా పత్రికాముఖంగా వెల్లడించాల్సిన అవసరముంది. ఒకవేళ బిల్డాక్స్ సంస్థ గనక స్పందించకపోతే, టీఎస్ రెరా సదరు సంస్థపై ప్రాజెక్టు విలువలో పది శాతం జరిమానా విధిస్తుందా? లేదా? అనే అంశాన్ని తెలుసుకోవడానికి.. తెలంగాణ నిర్మాణ రంగమెంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఎందుకంటే, సాహితీ ఉదంతం తర్వాత.. అంతకు రెట్టింపు స్థాయిలో ప్రజలు ఈ బిల్డాక్స్‌లో మోసపోయే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఎందుకంటే, ఈ సంస్థ కొండాపూర్‌లో చదరపు అడుక్కీ కేవలం నాలుగు వేల ఏడు వందలే అంటూ ప్రచారాన్ని ఊదరగొడుతున్నాయి. పైగా, హైదరాబాద్‌లోనే పేరెన్నిక గల నిర్మాణ సంస్థ అయిన మై హోమ్ సంస్థ పూర్తి చేసిన మంగళకు ఎదురుగా.. ఇంత తక్కువకే ఫ్లాటు వస్తుంటే.. బయ్యర్లు ఎగిరి గంతేస్తున్నారు. ఇందులో కొనుక్కున్నవారికి.. అది హఫీజ్‌ఫేట్ సర్వే నెంబర్ 80 పరిధిలోకి వస్తుందని.. అందులో సుప్రీం కోర్టులో కేసుందనే విషయం తెలియదు. ఇప్పుడు ఆనంద పడినవారే.. రానున్న రోజుల్లో దుఃఖపడే అవకాశం లేకపోలేదు. అందుకే, ఈ ప్రాజెక్టులో సొమ్ము పెట్టి ప్రజలు మోసపోకుండా ఉండాలంటే.. టీఎస్ రెరా అథారిటీ తక్షణమే ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిలిపివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే, కాంగ్రెస్ హయంలో ఇదో పెద్ద స్కామ్ అయ్యే ప్రమాదముంది.
This website uses cookies.