గత పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన పొరపాటే మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందా అనే సందేహం రియాల్టీ వర్గాల్లో కలుగుతోంది. రెరా మాజీ సభ్యకార్యదర్శి బాలకృష్ణ హెచ్ఎండీఏలో చేసిన అక్రమాల సంగతి తెలిసిందే. హెచ్ఎండీఏ కమిషనర్ మరియు పురపాలక శాఖ్య స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వ్యవహరించిన అరవింద్ కుమార్ అండ చూసుకుని చెలరేగిపోయిన బాలకృష్ణ ఏసీబీకి ఇటీవల అడ్డంగా దొరికిపోయారు. మరి, ఇంత తతంగం జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అదే తప్పు చేస్తే ఎలా?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి మరియు హెచ్ఎండీఏ కమిషనర్‌గా దానకిశోర్‌ను నియమించింది. ఆయన సమర్థుడైన అధికారి అనే విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే, రెండు పదవులు ఒకరికే ఇవ్వడం వల్ల కొత్త సమస్యలు పుట్టుకొచ్చే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి, హెచ్ఎండీఏకు ప్రత్యేకంగా పూర్తి స్థాయి కమిషనర్‌ను ఏర్పాటు చేస్తే.. నిర్మాణ రంగానికెంతో ఉపయోగకరంగా ఉంటుంది. లేకపోతే, మళ్లీ బీఆర్ఎస్‌లో జరిగిన తప్పులే మళ్లీ జరిగేందుకు ఆస్కారం ఉందని నిర్మాణ రంగం అభిప్రాయపడుతోంది. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా అమ్రపాలిని నియమించిన విషయం తెలిసిందే. కాకపోతే, తనకు మూసీ రివర్ ఫ్రంట్ బాధ్యతల్ని అదనంగా అప్పచెప్పారు. ఫలితంగా హెచ్ఎండీఏ మీద తనకు పెద్దగా ఫోకస్ ఉండకపోవచ్చని నిర్మాణ రంగం భావిస్తోంది. అందుకే, హెచ్ఎండీఏకు పూర్తి స్థాయి కమిషనర్‌ను నియమించాలని తెలంగాణ నిర్మాణ రంగం ముక్తకంఠంతో కోరుతోంది.
This website uses cookies.