బెంగళూరుకు చెందిన ప్రెస్టీజ్ ఎస్టేట్స్ సంస్థ కోకాపేట్‌లోని నియోపోలిస్‌లో క్లెయిర్‌మోంట్ అనే ప్రాజెక్టులో.. ప్రీలాంచ్లో ఫ్లాట్లను విక్రయించిన విషయం తెలిసిందే. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఫ్లాట్లను విక్రయించామని.. బయ్యర్ల నుంచి చెక్కులు తీసుకున్నామని.. స్వయంగా సంస్థ ప్రతినిధి తెలిపారు. ఈ క్రమంలో కొందరు ఛానెల్ పార్ట్‌నర్లు ప్రెస్టీజ్ క్లెయిర్‌మోంట్ ప్రీలాంచ్ సేల్స్ గురించి సోషల్ మీడియాలో ప్రకటనల వర్షం కురిపించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ సంస్థ ప్రీలాంచ్ చేసిన నెలకు అటుఇటుగా తేదీలు వేసి రెరా అనుమతినిచ్చారు. ఈ ప్రాజెక్టుకు ఫిబ్రవరిలో అనుమతినిచ్చి నవంబరులో ఇచ్చినట్లు చూపించడమేమిటి? అంటే, అసలు తాము ప్రీలాంచ్లో ఫ్లాట్లు అమ్మలేదని రాంగ్ రూటులో చూపించుకునే ప్రయత్నం ఈ సంస్థ చేస్తోంది.
రెరా నిబంధనల ప్రకారం.. రెరా అనుమతి తీసుకోకుండా ఇలా ప్రకటనల్ని విడుదల చేయకూడదు. ఫ్లాట్లను విక్రయించకూడదు. కాకపోతే, చెక్కులు తీసుకున్నా.. రెరా వచ్చాకే బ్యాంకులో డిపాజిట్ చేస్తామని సంస్థ బుకాయించింది. ఇది ఒక ఎత్తయితే.. ప్రెస్టీజ్ క్లెయిర్‌మెంట్ ప్రాజెక్టుకు తెలంగాణ రెరా అథారిటీ తాజాగా రెరా అనుమతిని మంజూరు చేసింది. ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను విక్రయించే సంస్థ నుంచి తెలంగాణ రెరా అథారిటీ జరిమానా వసూలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఆయా సంస్థ ఎన్ని ఫ్లాట్లను విక్రయించిందో.. ఆయా సంఖ్యను బట్టి తెలంగాణ రెరా అథారిటీ జరిమానా వసూలు చేయాలి. ఈ సంస్థ ప్రెస్టీజ్ క్లెయిర్‌మెంట్ ప్రాజెక్టును 7.5 6 ఎకరాల్లో చేపట్టింది. 928 ఫ్లాట్లను అమ్మకానికి పెట్టింది. ఇందులో సుమారు 800 వందల ఫ్లాట్లను విక్రయించిందని సమాచారం. దీని బట్టి.. ప్రతి ఫ్లాటు మీద రూ.25 వేలు లెక్కిస్తే.. రూ.2 కోట్లను జరిమానా విధించాలి. మరి, ఈ సంస్థ రూ.2 కోట్ల జరిమానాను చెల్లించి రెరా నెంబరు తెచ్చుకుందా? లేక ప్రభుత్వ పెద్దలను ఏదోరకంగా మేనేజ్ చేసి రెరా నుంచి అనుమతి తీసుకుందా? అనే అంశంపై హైదరాబాద్ నిర్మాణ రంగంలో చర్చ జరుగుతోంది.
This website uses cookies.