ఫ్లాట్ కొనుక్కోగానే ఇక అద్దె బాధ తప్పిందిరా బాబూ అనుకోవడానికి వీల్లేకుండా అపార్ట్ మెంట్ మెయింటనెన్స్ ఛార్జీలు కనిపిస్తాయి. ప్రతినెలా నిర్దేశిత మొత్తాన్ని నిర్వహణ ఛార్జీల కింద చెల్లించక తప్పదు. సాధారణంగా కొత్త అపార్ట్ మెంట్ల నిర్వహణ ఛార్జీలను ఏడాదో, రెండేళ్లో సంబంధిత బిల్డరే భరిస్తాడు. ఇది ఫ్లాట్ కొనుగోలు ఒప్పంద సమయంలోనే తెలుస్తుంది. ఆ వ్యవధి పూర్తయిన తర్వాత నిర్వహణ బాధ్యత ఆ నివాసితుల సంక్షేమ సంఘానిదే. ఇక్కడ నుంచే సమస్య మొదలవుతుంది. నిర్వహణ ఛార్జీల లెక్కింపులో భిన్నాభిప్రాయలు రావడమే ఇందుకు కారణం.
సాధారణంగా ఫ్లాట్ కి ఇంత మొత్తం చొప్పున ఏకరీతి ఛార్జీలు వసూలు చేయాలని కొందరు అభిప్రాయపడుతుండగా.. ఫ్లాట్ విస్తీర్ణాన్ని బట్టి ఛార్జీలు ఉండాలని మరికొందరు అంటున్నారు. దీంతో ఆ అపార్ట్ మెంట్ లోని నివాసితుల మధ్య వైరుధ్యాలు, అభిప్రాయబేధాలు తలెత్తుతున్నాయి. వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్ కూ, 2వేల చదరపు అడుగుల ఫ్లాట్ కూ ఒకే విధంగా నిర్వహణ ఛార్జీలు వసూలు చేయడం సబబు కాదనే భావన క్రమంగా బలపడుతోంది. ఈ నేపథ్యంలో ఫ్లాట్ నిర్వహణ ఛార్జీలను ఎలా నిర్ణయించాలి? నిబంధనలు ఏం చెబుతున్నాయి ఓ సారి చూద్దామా?
అపార్ట్ మెంట్ నిర్వహణ ఛార్జీలు ఫ్లాట్ విస్తీర్ణం ప్రాతిపదికన చదరపు అడుగుకు మాత్రమే ఉండాలని పరిశ్రమలోని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అపార్ట్ మెంట్ లోని కామన్ ఏరియాలకు నిర్వహణ ఛార్జీలను నిర్ణయించడానికి నిర్దిష్ట నియమాలు లేనప్పటికీ, ఫ్లాట్ పరిమాణం ఆధారంగా చదరపు అడుగుకు మెయింటనెన్స్ ఛార్జీలు నిర్ణయించాలని పేర్కొంటున్నారు. అయితే, ఫ్లాట్ పరిమాణాల్లో చాలా స్వల్పంగా మాత్రమే తేడాలుంటే అలాంటి సందర్భంలో ఏకరీతిని నిర్వహణ ఛార్జీలు నిర్ణయించుకోవచ్చని చెబుతున్నారు.
పరిమాణంలో భారీగా తేడా ఉన్నప్పుడు అందరినీ ఒకే విధమైన ఛార్జీలు చెల్లించమని అడగడం సరికాదంటున్నారు. అనేక రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ అపార్ట్ మెంట్స్ (నిర్మాణ, యాజమాన్యం ప్రమోషన్) చట్టం, 1987 కూడా ఫ్లాట్ పరిమాణం లేదా విస్తీర్ణానికి అనుగుణంగా నిర్వహణ ఛార్జీలు వసూలు చేయాలని పేర్కొంటోందని అనరాక్ గ్రూప్ రీజనల్ డైరెక్టర్, రీసెర్చ్ హెడ్ ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు. ఫ్లాట్ పరిమాణం లేదా విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఏ సొసైటీలైనా నిర్వహణ ఛార్జీలు వసూలు చేస్తుంటే దానిని కోర్టులో సవాల్ చేయవచ్చని పేర్కొన్నారు.
చట్టపరమైన పరిష్కారాలివీ..
ఒకవేళ ఏదైనా సొసైటీ ఏకరీతి ఛార్జీలు చెల్లించాలని చిన్న ఫ్లాట్ యజమానులను ఒత్తిడి తెస్తే వారు అనేక చట్టపరమైన పరిష్కారాలు పొందే వెసులుబాటు ఉంది. ఫ్లాట్ యజమానుల అసోసియేషన్ లేదా సొసైటీ సభ్యులపై కోర్టుకు వెళ్లొచ్చు. ఫ్లాట్ పరిమాణం ఆధారంగా ఛార్జీలు విధించాలని కోరవచ్చు. ఇది సివిల్ వివాదం కాబట్టి పోలీసులను ఆశ్రయించడం మంచిది కాదు. తొలుత ఈ అంశంపై రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీకి ఫిర్యాదు చేయవచ్చు. అన్యాయమైన పద్ధతులు, హక్కుల ఉల్లంఘన జరిగితే వినియోగదారుల ఫోరమ్ ను ఆశ్రయించవచ్చు. సివిల్ కోర్టులో కూడా చట్టపరమైన చర్యలు ప్రారంభించవచ్చు. ఇలాంటి చర్యలను రెరా ట్రిబ్యునల్ లో కూడా సవాల్ చేసే అవకాశం ఉంది.