కొత్తగా హౌసింగ్ కో ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసుకోవాలంటే ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏమిటి? అందుకు ఏమేం పత్రాలు కావాలి? హౌసింగ్ సొసైటీలో ఉంటే లాభాలేమిటో చూద్దామా?
దరఖాస్తుకు ఆమోదం పొందడం అనేది హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభాన్ని సూచిస్తుంది. సభ్యులు సమావేశం ఏర్పాటు చేసి, రిజిస్ట్రేషన్ ప్రయత్నాలను చూసే చీఫ్ ప్రమోటర్ ను ఎన్నుకుంటారు. అనంతరం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించడానికి తీర్మానం ఆమోదిస్తారు. తొలుత హౌసింగ్ సొసైటీకి పేరు ఎంచుకుని రిజర్వు చేసుకోవాలి. ఇందుకు కనీసం పది మంది సభ్యులు దరఖాస్తులో సంతకం చేయాలి. దరఖాస్తుతోపాటు రిజిస్ట్రార్ కు నిర్ణీత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అప్పటి నుంచి సాధారణంగా మూడు నెలల వరకు ఆ పేరు ఎవరూ వాడుకోకుండా చూస్తారు. అనంతరం దరఖాస్తు రిజిస్ట్రేషన్ దశ ప్రారంభమవుతుంది. 1912 సహకార సంఘాల చట్టం ప్రకారం ఏ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అయినా దాని పేరులో ‘లిమిటెడ్’ అనే పదాన్ని చివరన చేర్చాలి.
సంఘంలో సభ్యులుగా ఉన్న ప్రతిపాదిత సభ్యులు చట్ట ప్రకారం చందా మొత్తాన్ని చెల్లిస్తారు. సొసైటీ ఆర్థిక లావాదావీల నిర్వహణ కోసం బ్యాంకు ఖాతా తెరవాలి. ఇందులో కొంత మూలధన మొత్తాన్ని జమ చేయాలి. రిజిస్ట్రార్ కోరిన అదనపు సమాచార వివరాలు అందించిన తర్వాత ఆ దరఖాస్తును క్షుణ్నంగా పరిశీలిస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తవుతుంది. అప్పుడు ఇన్ కార్పొరేషన్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఇది ఆ సహకార సొసైటీ రిజిస్టర్డ్ ఎంటిటీగా చట్టపరమైన స్థితిని నిర్ధారిస్తుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ దరఖాస్తు తిరస్కరిస్తే, ట్రిబ్యునల్ లో అప్పీలు చేసుకోవచ్చు. తిరస్కరణ జరిగిన నెల రోజుల్లో అప్పీల్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ కు అవసరమైన పత్రాలు..
రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తును నాలుగు కాపీలలో నింపి కనీసం 90 శాతం ప్రమోటర్లు సంతకాలు చేయాలి.
సొసైటీ ఆర్థిక అంశాలను తెలియజేసే పత్రాలు, స్టేట్ మెంట్లతో పాటు బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలి.
ప్రమోటర్ సభ్యులకు సంబంధించిన సమాచారం
సొసైటీ కార్యకలాపాలు, దాని నియమాలు, నిబంధనలు ఏమిటో వివరించాలి.
సొసైటీ పరిపాలనను నిర్ధారించే ప్రతిపాదిత బైలాస్ కాపీలు
ఫారం డి లో సొసైటీ ఆర్థిక లావాదేవీలు, ఖాతాలను వివరించే స్టేట్ మెంట్
రిజిస్ట్రార్ అడిగిన ఏవైనా ఇతర పత్రాలు.. అంటే టైటిల్ క్లియరెన్స్ సర్టిఫికెట్, వ్యవసాయేతర భూమిగా నిర్ధారించే సర్టిఫికెట్, ల్యాండ్ సీలింగ్ యాక్డ్ ఆర్డర్ దరఖాస్తు, ఆమోదించిన నిర్మాణ లే ఔట్, టైటిల్ సెర్చ్ సర్టిఫికెట్, అనుమతి పత్రం, నిర్మాణ పూర్తి ధ్రువీకరణ పత్రం, డెవలప్ మెంట్ అగ్రిమెంట్, ల్యాండ్ లార్డ్స్ పవర్ ఆఫర్ అటార్నీ, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు పత్రాలు, ఆర్కిటెక్ట్ సర్టిఫికెట్ తదితరాలు
హౌసింగ్ సొసైటీలో నివసించడం వల్ల లాభాలేంటి?
ఇతర రకాల గృహాలతో పోలిస్తే సహకార హౌసింగ్ సొసైటీలు సరసమైన ఇళ్లను అందజేస్తాయి. తక్కువ ధరకే ఆస్తిని సొంతం చేసుకోవడం లేదా అద్దెకు తీసుకోవడం కుదరుతుంది.
సహకార సంఘాలు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తాయి. నిర్ణయాత్మక ప్రతి సభ్యుడికి ఓ అభిప్రాయం ఉంటుంది. సభ్యులు చర్చల్లో పాల్గొనడానికి, ముఖ్యమైన అంశాల్లో ఓటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది.
సొసైటీ నిర్వహణ, సౌకర్యాల కల్పనను అందరూ పంచుకుంటారు.
సహకార హౌసింగ్ సొసైటీలు కమ్యూనిటీ, సొంతం అనే బలమైన భావాన్ని పెంపొందిస్తాయి. నివాసితులు తమ పొరుగువారితో పరస్పరం సంభాషించుకోవడానికి, సంబంధాలను పెంపొందించడానికి చక్కని వాతావరణం ఉంటుంది.
పార్కులు, ఉద్యానవనాలు, ఆటస్థలాలు, కమ్యూనిటీ హాళ్లు, క్రీడా సౌకర్యాల వంటి వాటిని అందరూ కలిసి ఏర్పాటు చేసుకోవచ్చు.
సహకార సంఘాలు సాధారణంగా ఎన్నుకున్న కమిటీ సభ్యులు లేదా బోర్డు ద్వారా సమర్థవంతంగా నిర్వహిస్తారు. మేనేజ్ మెంట్ కమిటీ.. పరిపాలనా పనులు, ఆర్థిక వ్యవహారాలతోపాటు ఏవైనా సమస్యలు వస్తే పరిష్కరిస్తుంది.
సహకార హౌసింగ్ సొసైటీలు నివాసితుల కోసం తరచుగా పండుగలు, ఈవెంట్లు, కమ్యూనిటీ సమావేశాలతో సహా సామాజిక, సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వహిస్తాయి. ఇది సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహిస్తుంది.