ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ను ఓసీ అని పిలుస్తారు. ఇల్లు కొన్న తర్వాత దానిని స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన కీలక పత్రాల్లో ఇది ఒకటి. అయితే, ఇది లేకపోవడం వల్ల ఫ్లాట్ డెలివరీ జాప్యం అవుతోంది. ఓసీ లేకపోవడంతో ఇల్లు స్వాధీనం చేసుకోవడం కుదరదు. దీంతో ఈ సర్టిఫికెట్ కోసం బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. మరి ఓసీ జారీకి కారణాలేంటి? ఇందుకు బాధ్యులెవరు? అంటే.. సాధారణంగా బిల్డర్ల వైపే చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే వారు చేయాల్సిన పేపర్ వర్క్ సరైన సమయానికి పూర్తి చేయకపోవడం, ఆమోదించిన ప్లాన్ ప్రకారం నిర్మాణం చేయకపోవడం వంటివి ప్రధాన కారణాలు. కొన్నిసార్లు అధికారుల అలసత్వం, సుదీర్ఘ ప్రక్రియ కూడా ఓసీ జారీలో జాప్యానికి కారణాలుగా ఉంటున్నాయి.
ఇటీవల ముంబైలో ఓ డెవలపర్ చేపట్టిన ప్రాజెక్టుకు అధికారులు ఓసీ ఇవ్వడానికి నిరాకరించారు. ఆ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి రానందున ఓసీ ఇవ్వలేమని పేర్కొన్నారు. తాను అవసరమైన అన్ని అనుమతులు పొందానని, అన్ని నిబంధనలు పాటించానని చెప్పినా అధికారులు వినలేదు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించగా.. అనుకూలంగా తీర్పు వచ్చింది. కొన్ని సందర్భాల్లో అన్ని అనుమతులూ ఉన్నప్పటికీ, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఓసీ జారీ అనేది సుదీర్ఘ ప్రక్రియ అని.. ఇది కూడా జాప్యానికి మరో ప్రధాన కారణమని పేర్కొంటున్నారు. ఇవన్నీ కూడా అంతిమంగా కొనుగోలుదారులపైనే ప్రభావం చూపిస్తాయి.
This website uses cookies.