దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధి కొనసాగుతోంది. ప్రస్తుత సంవత్సరంలో మన మార్కెట్ 265.18 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని.. అలాగే 2028 నాటికి ఏకంగా 828.75 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులకు దీర్ఘకాలిక లాభాన్ని ఆర్జించడానికి రియల్ రంగం ఎప్పుడూ చక్కని మార్గమే. అలాగే డెవలపర్లకు కూడా ఇది లాభదాయకమైన మార్గం. అయితే, లాభాలు ఎలా సంపాదించినా పన్ను మాత్రం కట్టాల్సిందే కదా? మున్సిపల్ కార్పొరేషన్ పన్నుతోపాటు జీఎస్టీ, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు సహా అనేక పన్నులు చెల్లించాలి. మరి ఈ విషయంలో పన్ను ఆదాకు సంబంధించి ఎలాంటి మార్గాలున్నాయో చూద్దామా?
తరుగుదలపై పొదుపు
రియల్ ఎస్టేట్ కూడా తరుగుదల (డిప్రిసియేషన్)కు లోబడి ఉంటుంది. అందువల్ల పెట్టుబడిదారులు, డెవలపర్లు తమ ఆస్తులపై పన్ను ఆదా చేయడానికి ఈ వ్యూహాన్ని ఉపయోగిస్తారు. ఆస్తి విలువ నష్టాన్ని చూపించడానికి తరుగుదల ఉపయోగిస్తారు. ఇది పెట్టుబడిదారులు, డెవలపర్లకు పన్ను విధించతగిన ఆధాయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఆదాయపన్ను చట్టం ప్రకారం నివాస ప్రాపర్టీలకు వార్షిక తరుగుదల రేటు 5 శాతం ఉండగా.. నివాసేతర ప్రాపర్టీలకు ఇది 10 శాతంగా ఉంది.
ఉమ్మడి యాజమాన్యం
పెట్టుబడిదారులు, డెవలపర్లకు లాభదాయకంగా ఉండే మరో వ్యూహం.. ఉమ్మడిగా ఆస్తిని కలిగి ఉండటం. ఒక ఆస్తి సహ యజమానులకు ఉమ్మడిగా సొంతమైతే.. అది గృహ రుణంపై ఉంటే.. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద రూ.1.5 లక్షల రాయితీ లభిస్తుంది. అంతే కాకుండా వారు ఆ ఆస్తిపై అద్దె సంపాదిస్తుంటే.. ఆ అద్దె లేదా మూలధన లాభాలను విభజించడం ద్వారా పన్ను భారం నుంచి తప్పించుకోవచ్చు. ఇతర యజమాని తక్కువ పన్ను పరిధిలోకి వస్తే ఈ వ్యూహం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
వ్యవసాయ భూమిలో పెట్టుబడి
దేశంలో వ్యవసాయ భూమి అనేది పెట్టుబడికి లాభదాయకమైన సాధనం ఒక్కటే కాదు.. పెట్టుబడిదారులకు పన్నులు తగ్గించడానికి మంచి కొనుగోలు వ్యూహం కూడా. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 54 ప్రకారం వ్యవసాయ భూమిని మూలధన ఆస్తుల కింద వర్గీకరించనందున అలాంటి ఆస్తుల అమ్మకంపై మూలధన లాభాల పన్ను విధించలేదు. ఆదాయాలు, పన్ను ఆదా పరంగా వ్యవసాయ భూమిలో పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది.
వ్యూహాత్మక పెట్టుబడులు
54ఈసీ బాండ్లలో పెట్టుబడి పెట్టడం ఓ మంచి వ్యూహం. ఇది ప్లాట్ల అమ్మకం ద్వారా వచ్చే మూలధన లాభాలపై రూ.50 లక్షల వరకు తగ్గింపు పొందడంలో పెట్టుబడిదారులకు సహకరిస్తుంది. అయితే, ఈ ప్రయోజనం పొందాలంటే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ), నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) జారీ చేసిన 54ఈసీ బాండ్లను మాత్రమే కొనుగోలు చేయాలి.